Gujarat Assembly Polls 2022 నేడు గుజరాత్‌లో మొదటి విడత పోలింగ్.. 89 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికలలో అభ్యర్థులు ఎందరంటే..?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న  రాజకీయ పార్టీల అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు నేటితో తెరపడబోతుంది. మొత్తం 182 స్థానాల   గుజరాత్ అసెంబ్లీకి 89 నియోజకవర్గాలలో గురువారం(డిసెంబర్ 1) తొలి దశ పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలోని 19 జిల్లాలలో విస్తరించి

Gujarat Assembly Polls 2022 నేడు గుజరాత్‌లో మొదటి విడత పోలింగ్..  89 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికలలో అభ్యర్థులు ఎందరంటే..?
Gujarat Assembly Polls 2022
Follow us

|

Updated on: Dec 01, 2022 | 12:26 PM

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న రాజకీయ పార్టీల అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు నేటితో తెరపడబోతుంది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మొత్తం 182 స్థానాల గుజరాత్ అసెంబ్లీకి 89 నియోజకవర్గాలలో గురువారం(డిసెంబర్ 1) తొలి దశ పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలోని 19 జిల్లాలలో విస్తరించి ఉన్న ఈ 89 స్థానాలలో మొత్తం 788 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ దశ ఎన్నికలతో తేలనుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత రాష్ట్రంగా 27 సంవత్సరాలుగా ఉన్న గుజదాత్‌ను తమ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో  కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) ప్రకారం, గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 14,382 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరగనుంది. తొలి దశలో ఎన్నికలు జరగనున్న ఈ 89 స్థానాల్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48, కాంగ్రెస్ 40 సీట్లు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ), సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ), భారతీయ గిరిజన పార్టీ (బీటీపీ) సహా 36 ఇతర పార్టీలు పోటీ చేశాయి.  ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మొత్తం 89 స్థానాలలోనూ పోటీ చేయనుండగా ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాలలోనే బరిలోకి దిగనుంది.

 88 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు..

గుజరాత్ రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. తొలి దశలో ఆప్ అన్ని స్థానాల్లోనూ తన అభ్యర్థులను బరిలోకి దించినప్పటికీ, సూరత్ ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి దాని అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఆప్ కేవలం 88 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో మిగిలారు. ఇతర పార్టీల్లో బీఎస్పీ 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, బీటీపీకి చెందిన 14 మంది, సీపీఐ(ఎం)కు చెందిన నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ దశలో మొత్తం 339 మంది స్వతంత్రులు కూడా తమ సత్తాను చాటి  అసెంబ్లీలోకి ప్రవేశించాలని చూస్తున్నారు.

788 మందిలో 70 మంది మాత్రమే మహిళలు..

తొలి దశలో అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 788 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, వారిలో 70 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు. వారిలో 9 మంది బీజేపీ, 6 మంది కాంగ్రెస్, 5 మంది ఆప్ నుంచి ఉన్నారు. సౌరాష్ట్ర ప్రాంతంలోని దేవభూమి ద్వారకా జిల్లాలోని ఖంభాలియా అసెంబ్లీ నుంచి ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదన్ గధ్వి పోటీ చేయనున్నారు. ఆప్ గుజరాత్ యూనిట్ ప్రెసిడెంట్ గోపాల్ ఇటాలియా సూరత్‌లోని కతర్గాం స్థానం నుంచి అభ్యర్థిగా ఉన్నారు. మొదటి దశలో ప్రముఖ అభ్యర్థులు జామ్‌నగర్ నార్త్ కోసం క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా, హర్ష్ షాంఘ్వి, పూర్ణేష్ మోడీ పోటీపడనున్నారు. ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రముఖ గిరిజన నేత ఛోటు బసవ భరూచ్‌లోని ఝగాడియా నుంచి బరిలోకి దిగనున్నారు.

ఇవి కూడా చదవండి

14,382 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్..

రాష్ట్ర సీఈవో కార్యాలయ లెక్కల ప్రకారం గుజరాత్‌లో మొత్తం 4,91,35,400 మంది ఓటర్లు ఉన్నారు. మొదటి దశలో మొత్తం 2,39,76,670 మంది ఓటర్లు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిలో 5.74 లక్షల మంది ఓటర్లు 18 నుంచి 19 ఏళ్లలోపు వారు కాగా, 4,945 మంది ఓటర్లు 99 ఏళ్లు పైబడిన వారు. తొలి దశలో 14,382 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరగనుండగా, ఇందులో 3,311 పోలింగ్‌ కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయని, మిగిలిన 11,071 పోలింగ్‌ కేంద్రాలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

78 వేలకు పైగా ఎన్నికల అధికారులు

మొదటి దశలో 27,978 మంది ప్రిసైడింగ్ అధికారులు, 78,985 మంది ఎన్నికల అధికారులను నియమించనున్నారు. ఇంకా ఎన్నికల కమిషన్ 89 మోడల్ పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది, అనేక పోలింగ్ స్టేషన్‌లను వికలాంగ సిబ్బంది నిర్వహిస్తారు. 611 పోలింగ్ స్టేషన్‌లను మహిళలకు, 18 పోలింగ్ స్టేషన్ల బాధ్యతను యువతకు అప్పగించినట్లు ఈసీ తెలిపింది. మొదటి దశలో 34,324 బ్యాలెట్ యూనిట్లు, అంతే సంఖ్యలో కంట్రోల్ యూనిట్లు, 38,749 ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) మెషీన్లను వినియోగించనున్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు 2,20,288 మంది శిక్షణ పొందిన అధికారులు, ఉద్యోగులను నియమించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.

కాగా, మొదటి విడత ఎన్నికలు నేడు జరుగుతుండగా, రెండో విడత ఎన్నికలు డిసెంబర్ 5న జరుగుతాయి. ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 8న ప్రకటించనున్నట్లు ఈసీ ముందుగానే ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..