గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్..

పశ్చిమాసియా (గల్ఫ్) ప్రాంతంలో మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, సముద్ర భద్రతా సవాళ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల ప్రాణాలను, అలాగే.. భారత ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం హై-అలర్ట్ ప్రకటించింది.

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్..
Indian Seafarers Safety

Updated on: Jun 12, 2026 | 3:10 PM

పశ్చిమాసియా (గల్ఫ్) ప్రాంతంలో మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, సముద్ర భద్రతా సవాళ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల ప్రాణాలను, భారతదేశ సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం హై-అలర్ట్ ప్రకటించింది. ప్రతిస్పందన యంత్రాంగాలను పర్యవేక్షించడంతోపాటు.. సమన్వయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ (MoPSW), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (DGS) ద్వారా.. హోర్ముజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్, వాటికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతాలలో, వాటి పరిసరాల్లోని పరిణామాలపై నిరంతర పర్యవేక్షణను కొనసాగిస్తోందని తెలిపింది. తీవ్రమైన భౌగోళిక రాజకీయ అనిశ్చితి నెలకొన్న ఈ సమయంలో, భారతీయ నావికులకు, వారి కుటుంబాలకు భారత ప్రభుత్వం దృఢంగా అండగా నిలుస్తుందని , వారి సంక్షేమం, భద్రత, శ్రేయస్సును నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలను కొనసాగిస్తుందని పునరుద్ఘాటిస్తోంది.. అని ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

పత్రికా ప్రకటన ప్రకారం.. “భారత నావికులకు సకాలంలో మద్దతు, సహాయం అందేలా చూసేందుకు ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత నౌకాదళం, విదేశాల్లోని భారత మిషన్లు, మిత్ర దేశాల సముద్ర పరిపాలన సంస్థలు, షిప్పింగ్ కంపెనీలు, నావికుల సంక్షేమ సంస్థలు, ఇతర సంబంధిత భాగస్వాములతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటోంది.” ఈ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాణిజ్య నౌకలకు సంబంధించి ఇటీవల జరిగిన భద్రతా సంఘటనలు, వాణిజ్య నౌకాయానం ఎదుర్కొంటున్న పెరుగుతున్న ప్రమాదాలను వెలుగులోకి తెచ్చాయి. ప్రపంచ వాణిజ్యానికి, ఇంధన భద్రతకు ఈ అంతర్జాతీయ నౌకాయాన మార్గాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించి, భారతీయ నావికులు లేదా భారతీయ సముద్ర ప్రయోజనాలకు సంబంధించిన ఏ ఆకస్మిక పరిస్థితికైనా స్పందించేందుకు సిద్ధంగా, అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సంబంధిత ఏజెన్సీలన్నింటినీ ఆదేశించింది” అని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ (MoPSW) శాఖ ప్రకటనలో తెలిపింది. సంఘర్షణ ప్రభావిత జలాల గుండా ప్రయాణించే భారతీయ, విదేశీ జెండాలు గల నౌకలలో పనిచేస్తున్న భారతీయ నావికులందరూ అత్యంత జాగ్రత్త, అప్రమత్తతతో ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ సూచించింది.

నౌకా నిర్వాహకులు, షిప్పింగ్ కంపెనీలు కూడా ప్రస్తుత సముద్ర భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని, పరిస్థితులపై మెరుగైన అవగాహనను కొనసాగించాలని, అలాగే భారత ప్రభుత్వం, సంబంధిత అంతర్జాతీయ అధికార సంస్థలు జారీ చేసిన సలహాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. భారతీయ నావికులకు సంబంధించిన ఏ సంఘటననైనా తక్షణ జోక్యం, సమన్వయం కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్‌కు వెంటనే నివేదించాలని సంబంధిత వర్గాలను ఆదేశించడం జరిగింది. భారతీయ నావికులకు, వారి కుటుంబాలకు సహాయం అందించడానికి ప్రత్యేక సమాచార మార్గాలు, అత్యవసర ప్రతిస్పందన యంత్రాంగాలు ఇరవై నాలుగు గంటలూ పనిచేస్తూనే ఉంటాయిని పేర్కొంది.

కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి (MoPSW) సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. “గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోంది, ప్రతి భారతీయ నావికుడి భద్రత, రక్షణ, సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉంది. అవసరమైనప్పుడు సకాలంలో మద్దతు, సహాయం అందించడానికి అన్ని సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు, విదేశాల్లోని మిషన్లు సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నాయి.” అని తెలిపారు.

ముగ్గురు మృతి..

ఈ ప్రాంతంలో ఇటీవల నివేదించబడిన సంఘటనలలో, 24 మంది భారతీయ నావికులతో సహా 28 మంది సిబ్బందిని తీసుకువెళ్తున్న పలావు జెండా కలిగిన మధ్య శ్రేణి ట్యాంకర్ MT సెట్టెబెల్లో (IMO 9162916), ఒమన్‌లోని సోహార్‌కు ఈశాన్యంగా సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తుండగా, 10 జూన్ 2026న క్షిపణి దాడికి గురైంది. ఒమన్ సముద్ర భద్రతా కేంద్రం నుండి అందిన సమాచారం, నౌక యాజమాన్యం నుండి వచ్చిన తదుపరి నివేదికల ప్రకారం, ఈ దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం అందిన వెంటనే, భారత ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించడానికి సంబంధిత అధికారులు, ఓడ యజమానులు, ఆర్‌పిఎస్‌ఎల్‌తో చురుకుగా సమన్వయం చేసుకుంది. గల్లంతైన ముగ్గురు భారతీయ నావికుల మృతదేహాలను త్వరితగతిన గుర్తించి, నిర్ధారించారు, మిగిలిన సిబ్బంది అందరినీ సురక్షితంగా రక్షించారు. రక్షించబడిన నావికులను స్వదేశానికి రప్పించి, వారి పార్థివ దేహాలను వీలైనంత త్వరగా గౌరవప్రదంగా వారి కుటుంబాలకు అప్పగించేందుకు ఇప్పుడు ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు భారత ప్రభుత్వం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. సముద్రంలో తమ విధులను నిర్వర్తిస్తుండగా భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరని విషాదం. ఈ విషాద సంఘటనపై కేంద్ర ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ స్పందిస్తూ, “పలావు జెండా కలిగిన MT సెట్టెబెల్లో నౌకలో జరిగిన ఈ ఘోర సంఘటన గురించి తెలుసుకోవడం చాలా దురదృష్టకరం. విచారకరంగా, మొదట గల్లంతయ్యారని భావించిన ముగ్గురు భారతీయ నావికుల మృతదేహాలను గుర్తించి, నిర్ధారించిన తర్వాత వారు మరణించినట్లు ధృవీకరించబడింది. భారత పౌరుల భద్రత, భారత సముద్ర ప్రయోజనాల పరిరక్షణ, చట్టబద్ధమైన సరుకుల రవాణాకు అంతరాయం కలగకపోవడం మా అత్యంత ప్రాధాన్యతలుగా ఉంటాయి. భారత ప్రభుత్వం పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.. భారతీయ నావికుల ప్రాణాలను కాపాడటానికి , దేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుంది” అని అన్నారు.

భారతీయ నావికుల సంక్షేమం, భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగినవని ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది . డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సీఫేరర్స్ వెల్ఫేర్ ఫండ్ సొసైటీ (SWFS), ప్రభావిత నావికులకు, వారి కుటుంబాలకు అవసరమైనప్పుడు అర్హులైన సంక్షేమ ప్రయోజనాలు, ఆర్థిక సహాయం, ఇతర సహాయక చర్యలను అందించడానికి సిద్ధంగా ఉంది. నియమావళి ప్రకారం, మృతుల కుటుంబాలకు SWFS రూ. 10 లక్షలను విడుదల చేస్తోంది. ఇంకా సోనోవాల్ మాట్లాడుతూ, “ఇది మన సముద్రయాన కుటుంబానికి తీరని లోటు. ఈ క్లిష్ట సమయంలో మోదీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తుంది.. వారి కుటుంబ సభ్యులకు పూర్తి మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది. రక్షించబడిన సిబ్బంది మృతదేహాలను వెంటనే స్వదేశానికి రప్పించాలని, మృతుల పార్థివ దేహాలకు అంత్యక్రియల కోసం త్వరితగతిన తరలించాలని నేను అధికారులను ఆదేశించాను.” అని అన్నారు.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, సంబంధిత రిక్రూట్‌మెంట్ అండ్ ప్లేస్‌మెంట్ సర్వీస్ లైసెన్స్ (RPSL) ఏజెన్సీలతో కలిసి, ప్రభావిత నావికుల కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. రక్షించబడిన సిబ్బందిని స్వదేశానికి రప్పించడానికి, మృతదేహాలను తరలించడానికి, సంబంధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించడానికి ప్రభుత్వం సంబంధిత అధికారులతో చురుకుగా సమన్వయం చేస్తోందన్నారు.

ఏదైనా అత్యవసర సహాయం కోసం, పౌరులు MMDAC (DG కమ్యూనికేషన్ సెంటర్)ను dgcommcentre-dgs@nic.in అనే ఈమెయిల్ ద్వారా లేదా +91 8657549760 నంబర్‌కు వాట్సాప్/కాల్ ద్వారా సంప్రదించవచ్చు. సంప్రదించడానికి ప్రత్యామ్నాయ నంబర్లు: +91 2222613606, +91 8657549752) లేదా 24×7 ఫిర్యాదుల పరిష్కార మార్గాలైన టోల్-ఫ్రీ నంబర్ (దేశీయ): 1800-889-7768, అంతర్జాతీయ టోల్-ఫ్రీ: +1-888-988-0256, వాట్సాప్: +91 8655856830, enavik.24×7@gov.in కు ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

Follow Us