
ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద రెస్టారెంట్స్, హోటల్ కిచెన్స్‌లో శుభ్రత పాటించకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారనే వార్తలు తెగ వస్తున్నాయి. అవి చూస్తే.. జీవితంలో మళ్లీ ఎప్పుడూ అక్కడికి వెళ్లాలని అనిపించదు. అంత ఘోరంగా ఉన్నాయి ఆహారం తయారు చేసే ప్రదేశాలు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి, కేవలం లాభాల కోసం మాత్రమే చూస్తున్న రెస్టారెంట్లు, హోటల్స్‌పై కొరడా ఝుళిపించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సిద్ధమైంది. దేశంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. అపరిశుభ్రమైన వంటశాలలు, సురక్షితం కాని ఆహార పదార్థాలు, పరిశుభ్రత నిబంధనలు పాటించని ఆహార తయారీ కేంద్రాలు లేదా విక్రయ కేంద్రాలు కనిపిస్తే, వెంటనే తమ అధికారిక మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని పౌరులకు పిలుపునిచ్చింది. “కేవలం గమనించడమే కాదు.. వెంటనే నివేదించండి. సురక్షితం కాని ఆహార పద్ధతులు ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ యాప్ ద్వారా మీ అవగాహనను కార్యాచరణగా మార్చండి” అంటూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తన అధికారిక సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పేర్కొంది. ప్రజల సహకారంతో ఆహార భద్రతా ఉల్లంఘనలను గుర్తించి, వాటిపై వేగంగా చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం లక్ష్యమని వెల్లడించింది.
Don’t just notice it, report it!
Unsafe food practices affect everyone. Turn your awareness into action with the #FoodSafetyConnectApp.
Download 👇🏻https://t.co/ZDSzYMRMW3https://t.co/XM5HbtlYC0 pic.twitter.com/kBtsx7HfCr
— FSSAI (@fssaiindia) July 12, 2026
దేశవ్యాప్తంగా సురక్షితం కాని ఆహార ఉత్పత్తుల తయారీ, విక్రయం, పంపిణీపై ఇప్పటికే తనిఖీలను ముమ్మరం చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ మసాలా దినుసుల తయారీ యూనిట్‌పై దాడులు నిర్వహించింది. తనిఖీల్లో పరిశుభ్రత లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు బయటపడటంతో ఆ యూనిట్‌ను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ప్రయోగశాల పరీక్షల కోసం పలు నమూనాలను సేకరించారు. ఇదిలా ఉండగా ఆన్‌లైన్ క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తాజాగా తొమ్మిది నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల నుంచి గడువు ముగిసిన ఉత్పత్తులు, పాడైపోయిన ఆహార పదార్థాలు, కుళ్లిన గుడ్లు, గడువు ముగిసిన వే ప్రోటీన్, దెబ్బతిన్న ప్యాకేజింగ్ ఉన్న వస్తువుల సరఫరాపై ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
అంతేకాకుండా ‘నాయిస్ ఎగ్స్’కు సంబంధించిన లైసెన్సింగ్ లోపాలు, తప్పుడు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ వివరాలు, విక్రేతలు నిబంధనలు పాటించడంలో విఫలమవడం, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వంటి అంశాలను కూడా నియంత్రణ సంస్థ తన నోటీసుల్లో ప్రస్తావించింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఆహార భద్రత, నాణ్యత హామీ, నిల్వ నిర్వహణ, పరిశుభ్రత ప్రమాణాలు, లోపాల సవరణకు తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలను సమర్పించాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది. నిర్ణీత గడువులోగా అనుగుణ్యత నివేదిక సమర్పించకపోతే, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం–2006 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ పరిణామాలపై స్పందించిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, తమ దృష్టికి వచ్చిన అంశాలను సమీక్షిస్తున్నామని, గుర్తించిన లిస్టింగ్‌లను పరిశీలిస్తున్నామని, సమస్యల పరిష్కారానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామని వెల్లడించింది. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఆహార భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంలో ఎలాంటి రాజీ ఉండదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి