
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా అడవుల్లో చోటుచేసుకున్న అరుదైన వన్యప్రాణి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భారతదేశంలోని అడవుల్లో కనిపించని ఐదు చిన్న ఒరంగుటాన్ పిల్లలు బాలాసోర్ జిల్లాలోని బదాపాయి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఐదు జంతువులను సురక్షితంగా రక్షించారు. అనంతరం వాటిని భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌కు తరలించి క్వారంటైన్‌లో ఉంచారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ ఐదు ఒరంగుటాన్లలో మూడు మగ పిల్లలు, రెండు ఆడ పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇవన్నీ ఏడాది లోపు వయసున్నవిగా గుర్తించారు. కొన్ని పిల్లలు చాలా చిన్నవిగా ఉండటంతో వాటి ఆరోగ్యం, ఆహారం, ప్రవర్తనను నిపుణులు నిరంతరం పరిశీలిస్తున్నారు.
అసలు ఇవి ఒడిశా అడవుల్లోకి ఎలా వచ్చాయి? ఇదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఒరంగుటాన్లు భారతదేశానికి చెందిన సహజ వన్యప్రాణులు కావు. ఇవి సహజంగా దక్షిణాసియాలోని బోర్నియో, సుమత్రా దీవుల్లోని ఉష్ణమండల వర్షారణ్యాల్లో మాత్రమే కనిపిస్తాయి. తపనులి ఒరంగుటాన్ కూడా సుమత్రాలోని ప్రత్యేక ప్రాంతానికే పరిమితమై ఉంది. అందువల్ల బాలాసోర్ అడవుల్లో ఐదు చిన్న ఒరంగుటాన్లు కనిపించడం అత్యంత అసాధారణ ఘటనగా అధికారులు భావిస్తున్నారు. సహజంగా ఇవి ఇంత దూరం ప్రయాణించి భారతదేశానికి చేరుకునే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠా ప్రమేయం ఉందా? అనే కోణంలో ఒడిశా పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (STF), వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (WCCB) విచారణ చేపట్టాయి.
అయితే ఇప్పటివరకు ఈ జంతువులను ఎవరు తీసుకువచ్చారు, ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఏ మార్గంలో భారత్‌కు చేరాయి అనే విషయాలపై తుది నిర్ధారణ వెలువడలేదు. కాబట్టి అక్రమ రవాణా అనుమానం ఉన్నప్పటికీ, దానిని తుది నిజంగా పేర్కొనడం ఇంకా తొందరపాటు అవుతుంది.
ఒరంగుటాన్ ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన గొప్ప వానర జాతుల్లో ఒకటి. ఇవి కోతుల కంటే పరిణామ పరంగా మనుషులకు మరింత దగ్గరగా ఉండే Great Apes సమూహానికి చెందినవి. ‘ఒరంగుటాన్ అనే పేరు మలయ్ భాషలోని పదాల నుంచి వచ్చింది. దాని అర్థం సుమారుగా “అడవిలోని మనిషి” లేదా “అడవి మనిషి” అని చెప్పవచ్చు.
ప్రస్తుతం ప్రపంచంలో బోర్నియన్ ఒరంగుటాన్, సుమత్రన్ ఒరంగుటాన్, తపనులి ఒరంగుటాన్ ఇలా మూడు ఒరంగుటాన్ జాతులను గుర్తించారు. తపనులి ఒరంగుటాన్‌ను ప్రత్యేక జాతిగా 2017లో శాస్త్రవేత్తలు అధికారికంగా గుర్తించారు. ఇది ఉత్తర సుమత్రాలోని బటాంగ్ టోరు ప్రాంతంలోని అడవులకు పరిమితమై ఉంది. ప్రపంచంలో అత్యంత అరుదైన గొప్ప వానర జాతిగా దీనిని పరిగణిస్తారు.
ఒరంగుటాన్ల సహజ నివాసం ప్రధానంగా బోర్నియో, సుమత్రా దీవులు. బోర్నియో దీవి ఇండోనేషియా, మలేషియా, బ్రూనై దేశాల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ బోర్నియన్ ఒరంగుటాన్లు కనిపిస్తాయి. సుమత్రా దీవిలో ప్రధానంగా సుమత్రన్ ఒరంగుటాన్లు కనిపిస్తాయి. తపనులి ఒరంగుటాన్ మాత్రం సుమత్రాలోని బటాంగ్ టోరు అడవులకు పరిమితమై ఉంది. సుమారు 800 కంటే తక్కువ సంఖ్యలో మాత్రమే మిగిలి ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి.
ఒకప్పుడు ఒరంగుటాన్లు ఆగ్నేయాసియాలో మరింత విస్తృత ప్రాంతాల్లో ఉండేవి. కానీ అడవుల నరికివేత, వ్యవసాయ విస్తరణ, పామాయిల్ తోటలు, అక్రమ వేట, వన్యప్రాణి వ్యాపారం వంటి కారణాలతో వాటి సహజ నివాస ప్రాంతం భారీగా తగ్గిపోయింది.
ఒరంగుటాన్లలో అత్యంత ప్రత్యేకమైన లక్షణం వాటి చెట్లపై జీవించే అలవాటు. వాటి చేతులు చాలా పొడవుగా, బలంగా ఉంటాయి. చేతులు, కాళ్ల వేళ్లు కొమ్మలను గట్టిగా పట్టుకునేలా అభివృద్ధి చెందాయి. అందువల్ల చెట్ల కొమ్మల మధ్య సులభంగా కదలగలవు. వాస్తవానికి ఒరంగుటాన్ ప్రపంచంలోనే అతిపెద్ద చెట్లపై జీవించే క్షీరదాల్లో ఒకటి. దాని శరీర నిర్మాణం మొత్తం చెట్ల జీవితానికి అనుగుణంగా ఉంటుంది. సుమత్రన్ ఒరంగుటాన్లు దాదాపు పూర్తిగా చెట్లపైనే ఉంటాయి. ఆడ ఒరంగుటాన్లు నేలపైకి రావడం చాలా అరుదు. బోర్నియన్ ఒరంగుటాన్లు మాత్రం కొన్ని సందర్భాల్లో నేలపైకి దిగుతాయి.
ఒరంగుటాన్ల ఆహారంలో ప్రధాన భాగం పండ్లే. అంజీర్, మామిడి, లిచీ, మాంగోస్టీన్ వంటి పండ్లతో పాటు ఆకులు, చిగుళ్లు, పూలు, విత్తనాలు, చెట్ల బెరడు, చీమలు, చెదపురుగులు
ఇతర చిన్న కీటకాలు వంటి వాటినీ తింటాయి. పండ్లు వాటి ఆహారంలో సుమారు 60 శాతం వరకు ఉండవచ్చని WWF పేర్కొంటోంది.
ఒరంగుటాన్లను అడవుల తోటమాలులు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి తినే పండ్ల విత్తనాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాపిస్తాయి. ముఖ్యంగా పెద్ద విత్తనాలు కలిగిన పండ్ల చెట్ల విత్తనాలను దూర ప్రాంతాలకు వ్యాప్తి చేయడంలో ఒరంగుటాన్లు కీలక పాత్ర పోషిస్తాయి. అంటే ఒక ఒరంగుటాన్ పండ్లు తిని మరో ప్రాంతానికి వెళ్లడం ద్వారా అక్కడ కొత్త మొక్కలు పెరగడానికి పరోక్షంగా సహాయం చేస్తుంది. ఈ కారణంగా ఒరంగుటాన్ల సంరక్షణ అంటే కేవలం ఒక జంతువును కాపాడటం మాత్రమే కాదు.. మొత్తం అడవి పర్యావరణ వ్యవస్థను కాపాడటం కూడా.
వయోజన ఒరంగుటాన్లు సాధారణంగా ఒంటరిగా జీవిస్తాయి. అయితే పిల్లల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చిన్న ఒరంగుటాన్ పిల్లలు తల్లితో చాలా సంవత్సరాలు ఉంటాయి. WWF ప్రకారం, పిల్లలు తమ తల్లులతో ఎనిమిది సంవత్సరాల వరకు ఉండవచ్చు. గొప్ప వానర జాతుల్లో తల్లి–పిల్లల బంధం ఇంతకాలం కొనసాగడం చాలా ప్రత్యేకమైన విషయం. పిల్ల ఒరంగుటాన్ చిన్న వయసులో చెట్లపై కదలడం, ఆహారం వెతకడం, గూడు నిర్మించుకోవడం వంటి విషయాలను తల్లి దగ్గర నుంచే నేర్చుకుంటుంది.
అందుకే తాజాగా ఒడిశాలో దొరికిన ఐదు పిల్లల విషయంలో వాటి సంరక్షణ మరింత సున్నితమైన అంశంగా మారింది. అవి సహజ అడవిలో తల్లులతో పెరిగిన పిల్లలు కావా? లేక మనుషుల చేతుల్లోకి వెళ్లి తర్వాత వదిలివేశారా? అనే అంశం కూడా దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది.
ఒరంగుటాన్లు సాధారణంగా చెట్ల కొమ్మలపై గూళ్లు నిర్మించుకుని నిద్రిస్తాయి. పెద్ద కొమ్మలను ఒకదానితో ఒకటి లాగి అమర్చి, చిన్న కొమ్మలు, ఆకులతో నిద్రించడానికి అనువైన మెత్తని నిర్మాణాన్ని తయారు చేసుకుంటాయి. వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో గూడు పైభాగాన్ని కప్పుకునేలా అదనపు నిర్మాణం కూడా చేస్తాయి.
ఈ మూడు జాతుల్లో ఎన్ని మిగిలాయి అనేది అత్యంత ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం అడవుల్లో సుమారుగా బోర్నియన్ ఒరంగుటాన్: 1,04,700, సుమత్రన్ ఒరంగుటాన్: 13,846, తపనులి ఒరంగుటాన్: 800 కంటే తక్కువ ఉన్నాయి. మూడు జాతులూ అత్యంత తీవ్రంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నవిగా పరిగణించబడుతున్నాయి. ఒక శతాబ్దం క్రితం ప్రపంచవ్యాప్తంగా ఒరంగుటాన్ల సంఖ్య రెండు లక్షలకు పైగా ఉండేదని అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య భారీగా తగ్గిపోయింది.
ఒరంగుటాన్లకు అతిపెద్ద ముప్పు అడవుల నాశనం. ముఖ్యంగా అడవుల నరికివేత, పామాయిల్ తోటల విస్తరణ, వ్యవసాయ భూముల కోసం అడవుల మార్పు, రహదారులు, మౌలిక వసతుల నిర్మాణం, గనుల కార్యకలాపాలు, అడవుల్లో మంటలు, అక్రమ వేట, అక్రమ పెంపుడు జంతువుల వ్యాపారం, వన్యప్రాణుల అక్రమ రవాణా, వాటి మనుగడకు తీవ్రమైన ముప్పుగా ఉన్నాయి. ముఖ్యంగా చిన్న ఒరంగుటాన్ పిల్లలను అక్రమంగా పెంపుడు జంతువులుగా విక్రయించే ప్రమాదం ఉంది. పిల్లలను పట్టుకునే సమయంలో తల్లి ఒరంగుటాన్లు చంపబడే ఘటనలు కూడా నమోదయ్యాయి.
ఒడిశాలో దొరికిన ఐదు పిల్లల విషయంలో ఎందుకు ఇంత సంచలనం ఎందుకంటే ఇది సాధారణంగా అడవిలో కనిపించే జంతువు కాదు. బోర్నియో, సుమత్రా వంటి ప్రాంతాలకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని ఒడిశా అడవిలో ఐదు చిన్న ఒరంగుటాన్లు ఒకేసారి కనిపించడం సహజ వలసగా భావించడం కష్టం. అందుకే అటవీశాఖతో పాటు ప్రత్యేక దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. వాటిని ప్రస్తుతం నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌లో క్వారంటైన్, వైద్య పర్యవేక్షణలో ఉంచారు. అక్కడ వాటి ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ, ఆహారం అందిస్తున్నారు. కొన్ని పిల్లలు అరటిపండ్లను తినడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
అంతేకాదు, ఈ ఘటనకు ముందు రాత్రి ప్రాంతంలో ఒక నల్ల రంగు SUV కనిపించినట్లు CCTV ఆధారాలపై కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వాహనానికి ఒరంగుటాన్ల తరలింపుతో సంబంధం ఉందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. ఒడిశా అడవిలో కనిపించిన ఈ ఐదు చిన్న ప్రాణులు ఇప్పుడు కేవలం ఒక అరుదైన వన్యప్రాణి ఘటనగా మిగలడం లేదు.వీటిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఎప్పుడు భారత్‌కు తీసుకువచ్చారు? ఎందుకు తీసుకువచ్చారు? ఎవరైనా అక్రమంగా కొనుగోలు చేశారా? వీటి వెనుక అంతర్జాతీయ వన్యప్రాణి రవాణా ముఠా ఉందా? అనే ప్రశ్నలకు దర్యాప్తు సంస్థలు సమాధానాలు వెతుకుతున్నాయి. ప్రస్తుతం అధికారికంగా తేలిన విషయం మాత్రం ఒక్కటే.. భారతదేశానికి సహజంగా చెందినవి కాని, అత్యంత ప్రమాదంలో ఉన్న ఐదు ఒరంగుటాన్ పిల్లలు ఒడిశాలో కనిపించాయి; వాటిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఈ ఘటన మరోసారి ఒక విషయాన్ని గుర్తుచేస్తోంది. అడవిని కోల్పోతే ఒరంగుటాన్‌ను కూడా కోల్పోతాం. ఒరంగుటాన్లు జీవించేది చెట్ల మధ్యే.. వాటి భవిష్యత్తు కూడా ఆ అడవులతోనే ముడిపడి ఉంది.