Starlink: భారత్‌లో ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌ సేవలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

ఇంటర్నెట్ సేవల్లో విప్లవాత్మక మార్పులు వచ్చేస్తున్నాయ్. సంప్రదాయ కేబుల్ ఆధారిత ఇంటర్నెట్‌కు భిన్నంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు దేశ వ్యాప్తంగా అందరికి అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలందించేందుకు స్టార్ లింక్‌ సంస్థకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.

Starlink: భారత్‌లో ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌ సేవలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
Starlink

Updated on: Jun 06, 2025 | 8:13 PM

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్ లింక్‌కు భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం విభాగం లైసెన్స్‌ను జారీచేసింది. భారత్‌లో ఈ రకమైన లైసెన్స్ పొందిన మూడవ కంపెనీగా స్టార్‌లింక్ నిలిచింది. ఇప్పటికే యూకేకు చెందిన యులెసాట్ వన్‌వెబ్‌, భారతీయ దిగ్గజం రిలయన్స్ జియో ఈ లైసెన్సును పొందాయి. మరోవైపు దేశంలో ఇప్పటికే ఈ సేవలందిస్తోంది ప్రభుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్ సంస్థ. ఈ రంగంలోకి విదేశీ సంస్థల రాకతో నాణ్యమైన, హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.

దేశంలో స్టార్ లింక్ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన ట్రయల్ స్పెక్ట్రమ్‌ను దరఖాస్తు చేసిన 15 నుంచి 20 రోజుల్లోగా మంజూరు చేస్తామని టెలికాం శాఖ తెలిపింది. స్టార్‌ లింక్ ఇప్పటికే 125 దేశాల్లో సేవలను అందిస్తోంది. ప్రస్తుతం దేశంలో చాలావరకు సంప్రదాయ ఇంటర్నెట్ సేవలు వైర్ లెస్ లేదా ఫైబర్ కేబుల్స్‌ ఆధారంగా అందుతున్నాయి. ఇవి భూమికి సుదూరంగా భూ స్థిర కక్ష్యలో ఉండే ఉపగ్రహాలపై ఆధారపడి ఉన్నాయి. స్టార్ లింక్ సంస్థ తక్కువ ఎత్తులో ఉండే కక్ష్యలో ఉండే ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం స్టార్‌లింక్‌కు చెందిన 6వేల శాటిలైట్లు భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్నాయి. స్టార్‌లింక్ అందించే ఇంటర్నెట్ వేగంకూడా ఎక్కువగా ఉండనుంది. ప్రారంభంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగం 100-200 MBPS వరకు ఉంటుందని, భవిష్యత్తులో ఇది 600-700 GBPS బ్యాండ్‌ విడ్త్‌తో అత్యధిక వేగాన్ని అందిస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..