ఎంత నిర్లక్ష్యం.. ఎంత అజాగ్రత్త.. బ్లడ్ బ్యాంకు, వైద్య సిబ్బంది కేర్లెస్నెస్ వల్ల ముక్కుపచ్చలారని 8 నెలల పసికందు జీవితం అంధకారంలోకి వెళ్లింది. అవును ఆ చిన్నారికి హెచ్ఐవీ సోకింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర, అకోలా జిల్లా ముర్తిజాపుర్ మండలంలోని హిర్పుర్కు చెందిన దంపతులకు 8 నెలల క్రితం పాప జన్మించింది. చిన్నారి జన్మించిన మూడు రోజుల తర్వాత చిన్న, చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తడంతో.. ముర్తిజాపుర్లోని చిల్డ్రన్ హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. పలు రకాల మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్లు.. చిన్నారికి రక్తకణాలు తక్కువగా ఉన్నాయని.. వెంటనే రక్తం ఎక్కించాలన్నారు. దీంతో ఆ తల్లిదండ్రులు అకోలాలోని బీపీ ఠాక్రే బ్లడ్‌బ్యాంకు నుంచి రక్తాన్ని తీసుకొచ్చారు. డాక్టర్లు ఆ రక్తాన్ని చిన్నారికి ఎక్కించారు. అయితే.. ఇటీవల చిన్నారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యపరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. చిన్నారికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. వెంటనే బాలిక తల్లిదండ్రులకూ పరీక్షలు నిర్వహించారు. అయితే వారిద్దరికీ నెగెటివ్ వచ్చింది. దీంతో చిన్నారికి హెచ్ఐవీ సోకిన వ్యక్తి రక్తం ఎక్కించారని కన్ఫామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు..తమ బిడ్డ భవిష్యత్‌పై తీవ్రంగా దిగులు చెందుతున్నారు. ఘటనపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు.
అమెరికాలో పెళ్లని నమ్మించి.. రూ.22 లక్షలు చీటింగ్…
సికింద్రాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెళ్లి కోసం ఓ మ్యాట్రిమోనీ సైట్లో రిజిస్టర్ చేసుకుంది. అందులో పరిచయమైన బాల వంశీకృష్ణ అనే వ్యక్తి తాను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను అని చెప్పి ఆ యువతిని పరిచయం చేసుకున్నాడు. ఓ పెద్ద కంపెనీలో మంచి స్థాయిలో పనిచేస్తున్నట్లు నమ్మించాడు. అలా ఆమెతో పరిచయాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాడు. హైదరాబాద్‌లో కాకుండా అమెరికాలో పెళ్లి అంటూ ప్లాన్ చేశాడు. అమెరికాకు వస్తే ఇక్కడే పెళ్లి చేసుకొని అక్కడే సెటిలవుదామంటూ యువతిని నమ్మించాడు. అతని మాటలు నిజమే అని నమ్మిన ఆ అమ్మాయి అతను చెప్పింది చేస్తు వచ్చింది. వీసా కోసం బ్యాంకు బ్యాలెన్స్ చూపించాలంటూ యువతి వద్ద ఉన్న రూ.22.70 లక్షలను తన బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆ తర్వాత వంశీకృష్ణ పత్తా లేకుండా పోయాడు. అప్పుడు ఆ అమ్మాయికి అసలు విషయం బోదపడింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. గతంలో ఇదే తరహాలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో బాల వంశీకృష్ణ మరో యువతిని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతనిపై కేసు నమోదు చేశారు.
Also Read: బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం.. తెల్లారి నిద్రలేచి చూసేసరికి మైండ్ బ్లాంక్