
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కౌంట్‌డౌన్ మొదలవడంతో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. డీలిమిటేషన్ బిల్లు చుట్టూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను నిలువరించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు ఉమ్మడి వ్యూహానికి పదును పెడుతుంటే.. మరోవైపు ఇండియా కూటమిలోని మిత్రపక్షాల భిన్న వైఖరులు కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీ (శరద్ పవార్) వర్గం బిల్లుకు మద్దతు ప్రకటించడం విపక్ష శిబిరంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రత్యేక సమావేశాలకు ముందే ఇండియా కూటమి ఐక్యతపై ఆసక్తి నెలకొంది.
డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ అగ్రనేతల మంతనాలు
డీలిమిటేషన్ బిల్లుతో పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చర్చకు వచ్చే కీలక అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజిక్ గ్రూప్ అత్యవసరంగా సమావేశమైంది. సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఈ భేటీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. బిల్లును ఎలా ఎదుర్కోవాలి? విపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి ఎలా తీసుకురావాలి? అనే అంశాలపై నేతలు చర్చించినట్లు సమాచారం.
ఇదే క్రమంలో ఇండియా కూటమి పార్టీల మధ్య సమన్వయం కోసం శనివారం (నవంబర్ 28) ఖర్గే నివాసంలో విపక్ష నేతల సమావేశం నిర్వహించనున్నారు. అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపినట్లు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వెల్లడించారు. డీలిమిటేషన్ బిల్లుపై అన్ని పక్షాలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తాయని స్పష్టం చేశారు. ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో పలు పార్టీలు తమ ఎంపీలకు ఇప్పటికే విప్‌లు జారీ చేశాయి.
విపక్షాలకు ఎన్సీపీ షాక్.. బిల్లుకు మద్దతు!
కాంగ్రెస్ ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్న వేళ ఎన్సీపీ (శరద్ పవార్) వర్గం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు నేతలు వెల్లడించారు. తొలుత ముసాయిదా బిల్లును పరిశీలించిన తర్వాతే తమ వైఖరిని ప్రకటిస్తామని ఎంపీ సుప్రియా సూలే చెప్పగా.. శరద్ పవార్‌తో చర్చల అనంతరం మద్దతు నిర్ణయం వెలువడింది.
డీలిమిటేషన్ ప్రక్రియ తప్పనిసరి అని శరద్ పవార్ అభిప్రాయపడినట్లు ఎమ్మెల్యే జితేంద్ర అవధ్ వెల్లడించారు. మరోవైపు తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలకు ఎన్సీపీ-ఎస్పీ విప్ జారీ చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రతిపాదించే ఉమ్మడి వ్యూహానికి ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది.
తమిళనాడు ప్రయోజనాలపై స్టాలిన్ గట్టి పట్టు!
మరోవైపు డీఎంకే వైఖరిపై కూడా స్పష్టత వచ్చింది. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ఇస్తుందన్న ప్రచారాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. లోక్‌సభ స్థానాల సంఖ్య పెరిగినా తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్య వాటా తగ్గకూడదని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాలకు ఉన్న పార్లమెంటరీ ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలని కోరారు. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదన్నది డీఎంకే ప్రధాన అభ్యంతరంగా కనిపిస్తోంది.
ఇండియా కూటమి ఐక్యతకు అసలైన పరీక్ష!
మొత్తంగా డీలిమిటేషన్ బిల్లు ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయాలను బయటపెడుతోంది. కాంగ్రెస్ ఒకవైపు ఉమ్మడి పోరాటానికి ప్రయత్నిస్తుంటే.. ఎన్సీపీ-ఎస్పీ మద్దతు ప్రకటన, డీఎంకే షరతులు విపక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం అంత సులభం కాదని సూచిస్తున్నాయి. మరి ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో విపక్షాలన్నీ ఒకే నిర్ణయానికి వస్తాయా? డీలిమిటేషన్‌పై ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాయా? లేక మిత్రపక్షాల భిన్న వైఖరులతో కాంగ్రెస్‌కు కొత్త సవాళ్లు ఎదురవుతాయా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేదికగా డీలిమిటేషన్ బిల్లుపై జరిగే పరిణామాలు దేశ రాజకీయాల్లో కీలక చర్చకు దారితీయనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..