కేటుగాళ్లు బాగా తెలివి మీరిపోయారు. పోలీసులకు, కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా సరికొత్త వ్యూహాలను రచిస్తూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను యదేచ్చగా సాగిస్తున్నారు. అయితే ఖాకీలు ఏం తక్కువ కాదుగా.. వాళ్ల తోకలను కత్తిరిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సినిమాను తలపించే ఓ సీన్ చోటు చేసుకుంది. మాదకద్రవ్యాలను రవాణా చేస్తోన్న ఇద్దరు ప్రయాణీకుల నుంచి సుమారు రూ. 47 కోట్లు విలువ చేసే కొకెయిన్, హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎప్పటిలానే కస్టమ్స్ అధికారులు శుక్రవారం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టారు. ఈలోగా అప్పుడే ల్యాండ్ అయిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ నుంచి దిగిన ప్రయాణీకులను ఒక్కొక్కరిగా చెకింగ్ పాయింట్‌కు గ్రీన్ ఛానెల్ ద్వారా వస్తున్నారు. వారిలో ఓ ప్రయాణీకుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడటంతో.. అతడి బ్యాగ్ చెక్ చేశారు కస్టమ్స్ అధికారులు. అందులో పెద్ద సంఖ్యలో కుర్తా గుండీలు ఉన్నాయి. వాటిని మరింత జాగ్రత్తగా తనిఖీ చేయడంతో.. సదరు గుందీల్లో దాచిపెట్టిన 1.596 కిలోల కొకెయిన్ బయటపడింది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 16 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మరో కేసులో జోహన్నెస్‌బర్గ్ నుంచి నైరోబీ మీదుగా కెన్యా ఎయిర్‌వేస్‌లో వచ్చిన ఆ దేశానికి చెందిన వ్యక్తి తన హ్యాండ్‌బ్యాగ్‌లో నల్లటి ఫోల్డర్ కవర్లలో దాచి ఉంచిన 4.47 కిలోల హెరాయిన్ కస్టమ్స్ అధికారులకు లభ్యమైంది. దీని మార్కెట్ విలువ రూ. 31 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, కస్టమ్స్ అధికారులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై సెక్షన్ 8 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Continuing the drive against drugs smuggling, Mumbai Airport Customs seized 4.47 Kg Heroin valued at Rs 31.29 Cr & 1.596 Kg Cocaine valued at Rs 15.96 Cr in two separate cases. Heroin was concealed in documents folder covers whereas Cocaine was concealed in the clothes buttons. pic.twitter.com/shUkxJFUJ7
— Mumbai Customs-III (@mumbaicus3) January 6, 2023