Covishield Vaccine: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో దేశంలో మరోసారి విజృంభిస్తోంది. గతేడాది కంటే కూడా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా కేసులతో పాటుగా.. మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌పై సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదార్ పునావాలా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ షాట్ల మధ్య అంతరం ఎంత ఎక్కువగా ఉంటే.. టీకా ప్రభావం ప్రజలపై అంత బాగా ఉంటుందని వెల్లడించారు. రెండు షాట్ల మధ్య సుమారు రెండున్నర నుంచి మూడు నెలల వ్యవధి ఉంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రభావం 90 శాతం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ‘ది లాన్సెట్’ అధ్యయనాన్ని ఉటంకించిన ఆయన.. ఆక్స్‌ఫర్డ్ సహకారంతో ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కోవిషీల్డ్ టీకా షాట్ల మద్య నెల వ్యవధి ఉంటే 70శాతం ప్రభావం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే సుమారు వెయ్యి మందిపై పరిశోధన చేయడం జరిగిందని, 2-3 నెలల వ్యవధిలో రెండు మోతాదుల టీకా ఇస్తే దాని ప్రభావం 90శాతం ఉందని పరిశోధనల్లో తేలిందన్నారు.
ఇతర వ్యాక్సిన్లను కూడా పరిశీలించినట్లయితే.. టీకా రెండు డోస్‌ల మధ్య గ్యాప్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుందని పునావాలా పేర్కొన్నారు. టీకా షాట్ల మధ్య ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే.. టీకా ప్రభావం ప్రజలపై అంత బాగా ఉంటుందన్నారు. ఇక గత నెలలో జాతీయ నిపుణుల బృందం సిఫారసు మేరకు కోవిషీల్డ్ తొలి, రెండవ డోస్‌ల మధ్య అంతరాన్ని ఎనిమిది వారాలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. అలా గ్యాప్ ఎక్కువగా ఇవ్వడం వల్ల.. ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అయితే, ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అని అదార్ పునావాలా స్పష్టం చేశారు.
Also read: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై వర్క్ ప్లేస్‌లలోనూ కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అనుమతి.!