Corona Rules in Delhi: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతంగా ఉంది. ఈ నేపధ్యంలో అక్కడ ప్రభుత్వం ఇప్పటికే పాక్షిక లాక్ డౌన్ విధించింది. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా కొత్త వేరియంట్ ఇక్కడ ఎక్కువగా ప్రభావం చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో ఇండియన్ రైల్వేస్ కొత్తగా కొన్ని ఆంక్షలు పెట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్ళే ప్రయాణీకులకు సంబంధించి తీవ్రమైన ఆంక్షలు ప్రకటించింది.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్ళే ప్రయాణీకులు కచ్చితంగా అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుంది. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ ఆంక్షలను విధించారు. ఈ రెండు రాష్ట్రాల నుంచి అక్కడకు వెళ్ళే ప్రయాణీకులను తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్ కు పంపుతామని దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది. ఒకవేళ కరోనా టీకా రెండు డోసులూ తీసుకుని ఉంటే మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే అందుకు కూడా కొన్ని షరతులు విధించింది రైల్వే. దానిప్రకారం ఒకవేళ వ్యాక్సినేషన్ తీసుకున్నా సరే, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్ళే ప్రయాణీకులు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. నెగెటివ్ వచ్చిన సర్టిఫికేట్ తప్పనిసరిగా ప్రయాణ సమయంలో తమతో తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు కూడా ప్రయాణానికి 72 గంటల లోపు చేయించుకోవాలి. అంతే కాకుండా వారు 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుంది.
ఈ నిబంధన కచ్చితంగా అమలు అవుతుందనీ, కాబట్టి ప్రయాణీకులు గమనించాలనీ రైల్వే శాఖ కోరుతోంది. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే చేసిన ట్వీట్(Corona Rules in Delhi)..
All Rail Passengers Travelling to #Delhi from Andhra Pradesh and Telangana States are being sent to mandatory quarantine for 14 days….. pic.twitter.com/ZihNeyGh3p
— South Central Railway (@SCRailwayIndia) May 10, 2021
ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఆదివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటిన్ లో గత 24 గంటల్లో 20వేలకు పైగా కేసులు నమోదయినట్టు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,05,494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 22,164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 92 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,87,603 కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 8,707 కి పెరిగింది. తాజాగా గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నుంచి 8,832 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలరో 1,90,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారి విషయంలో తెలంగాణా ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరిస్తోంది. సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కరోనాకు చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వచ్చే కరోనా రోగుల వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. తెలంగాణలో ఉన్న ఆసుపత్రిల్లో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్సులకు అనుమతి ఇవ్వనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రుల అనుమతి లేకుండా కరోనా పేషేంట్లతో వస్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు.
సాధారణ వాహన ప్రయాణికులను మాత్రం తెలంగాణ పోలీసులు అనుమతిస్తున్నారు. ఈమేరకు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్ వద్ద తెలంగాణ పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఈ సరిహద్దుల ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కరోనా రోగులతో వస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకుని, వాటిని వెనక్కి పంపుతున్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా రోగులను తెలంగాణలోకి అనుమతించట్లేదని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఇతర వాహనాలను మాత్రం అనుమతిస్తున్నామని వెల్లడించారు.
Covid Vaccine: బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కరోనా వైరస్.. కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న స్టార్ కపుల్..