MBBS Seats: ఎంబీబీఎస్‌ సీట్ల కోసం మతం మార్చుకుంటున్న నీట్‌ అభ్యర్ధులు.. అప్రమత్తమైన కౌన్సెలింగ్ కమిటీ

|

Sep 18, 2024 | 12:02 PM

ఎంబీబీఎస్‌ సీట్లు పొందేందుకు పలువురు అభ్యర్థులు అడ్డదారులు తొక్కారు. ఎలాగైనా మెడికల్‌ సీట్లు సంపాదించాలన్న లక్ష్యంతో ఏకంగా మతాన్నే మార్చుకున్నారు. యూపీలో మైనారిటీ కాలేజీల్లో సీట్లు పొందేందుకు 12 మందికిపైగా అభ్యర్థులు ఇలా అడ్డదారిలో మతం మారినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. వీరందరూ మతమార్పిడి చట్టం 2021ని ఉల్లంఘించినట్టు అధికారులు గుర్తించారు..

MBBS Seats: ఎంబీబీఎస్‌ సీట్ల కోసం మతం మార్చుకుంటున్న నీట్‌ అభ్యర్ధులు.. అప్రమత్తమైన కౌన్సెలింగ్ కమిటీ
Conversion For Medical Admission
Follow us on

మీరట్‌, సెప్టెంబర్‌ 18: ఎంబీబీఎస్‌ సీట్లు పొందేందుకు పలువురు అభ్యర్థులు అడ్డదారులు తొక్కారు. ఎలాగైనా మెడికల్‌ సీట్లు సంపాదించాలన్న లక్ష్యంతో ఏకంగా మతాన్నే మార్చుకున్నారు. యూపీలో మైనారిటీ కాలేజీల్లో సీట్లు పొందేందుకు 12 మందికిపైగా అభ్యర్థులు ఇలా అడ్డదారిలో మతం మారినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. వీరందరూ మతమార్పిడి చట్టం 2021ని ఉల్లంఘించినట్టు అధికారులు గుర్తించారు. ఇలా వెలుగులోకి వచ్చిన 20 అడ్మిషన్లను అధికారులు స్క్రూటినీ చేస్తున్నారు. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ హోం మంత్రిత్వశాఖకు సమాచారం అందించారు. మొత్తం 20 మంది అభ్యర్థుల్లో ఏడుగురి అడ్మిషన్లను రద్దు చేశారు. మరో ఏడుగురు స్వచ్ఛందంగా తమ అడ్మిషన్లను వెనక్కి తీసుకున్నారు.

మీరట్‌లోని మైనారిటీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం కోసం మత మార్పిడికి పాల్పడిన యూపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంగా మారింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్, వారణాసి, బిజ్నోర్, మీరట్, హాపూర్, ముజఫర్‌నగర్‌కు చెందిన విద్యార్ధులతోపాటు, న్యూఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన విద్యార్ధులు కూడా ఇలా మతమార్పిడులకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ హోం శాఖతో పాటు, న్యూఢిల్లీ, మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు.

NEET-UG-2024 కౌన్సెలింగ్‌లో మొదటి రౌండ్‌లో ప్రవేశం పొందిన వారిలో దాదాపు 12 లక్షల (1.2 మిలియన్లు) పాల్గొన్నారు. మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో గతేడాది కంటే ఈసారి అత్యధికంగా మైనారిటీ అభ్యర్ధుల సంఖ్య పెరిగింది. దీనిని గుర్తించిన అధికారులు డాక్యుమెంట్ల స్క్రీనింగ్ (అప్) చేపట్టారు. ఈ అభ్యర్థులు కొన్ని వారాల క్రితమే మైనారిటీ హోదాను పొందినట్లు తేలింది. దీంతో డైరెక్టర్ జనరల్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కింజల్ సింగ్ 48 గంటల్లో సంబంధిత జిల్లాల నుండి పత్రాలను ధృవీకరించి, వేగంగా చర్య తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

UPPUCRA-2021లోని సెక్షన్ 8 (1) ప్రకారం ఎవరైనా మతాన్ని మార్చుకోవాలనుకుంటే కనీసం అరవై రోజుల ముందుగా, జిల్లా మేజిస్ట్రేట్ లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్‌కి షెడ్యూల్-lలో నిర్దేశించిన ఫారమ్‌లో డిక్లరేషన్ ఇవ్వాలి. జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా ప్రత్యేకంగా అధికారం పొందిన మేజిస్ట్రేట్, దరఖాస్తుదారుని సమ్మతితో ఎలాంటి బలవంతం, ప్రలోభం లేకుండా తన మతాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నట్లు తెలియజేయాలి. ఒక మతానికి చెందిన వ్యక్తిని మరొక మతంలోకి మార్చడానికి మార్పిడి వేడుకను నిర్వహించే వ్యక్తి ఒక నెల ముందుగానే నోటీసు ఇవ్వాలని చట్టం చెబుతోంది. తాజా ఘటనలో ఇవేమీ చేయకుండా ఇన్‌స్టంట్‌ మతమార్పిడులు చేసుకుని మైనారిటీ హోదాలో దాదాపు సగం సీట్లు పొందేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా మైనారిటీ అభ్యర్థులకు ర్యాంక్ తక్కువగా వచ్చినా మైనారిటీ హోదా ఉన్న అభ్యర్థి మైనారిటీ సంస్థలో సీటు పొందవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొందరు అభ్యర్ధులు అడ్డదారులు తొక్కడంతో కౌన్సెలింగ్ కమిటీ వెంటనే అప్రమత్తం అయ్యింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.