హాథ్రస్‌ బాధిత యువతి కుటుంబానికి మూడంచెల రక్షణ వ్యవస్థ

|

Oct 15, 2020 | 9:02 AM

హాథ్రస్‌ బాధిత యువతి కుటుంబానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అదే విధంగా సాక్షులకు కూడా మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశామని సుప్రీం కోర్టుకు తెలిపింది..

హాథ్రస్‌ బాధిత యువతి కుటుంబానికి మూడంచెల రక్షణ వ్యవస్థ
Follow us on

హాథ్రస్‌ బాధిత యువతి కుటుంబానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అదే విధంగా సాక్షులకు కూడా మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశామని సుప్రీం కోర్టుకు తెలిపింది.. అలాగే హాథ్రస్‌ ఘటనపై సీబీఐ నిర్దిష్ట కాలపరిమితితో విచారణ నిర్వహించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టుకు విన్నవించుకుంది యూపీ సర్కారు.. ప్రతి పక్షం రోజులకోసారి విచారణ జరుగుతున్న తీరుతెన్నులను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇచ్చేలా సుప్రీం ఆదేశాలు జారీ చేయమని వేడుకుంది.. ఆ నివేదికను క్రమం తప్పకుండా ఉత్తరప్రదేశ్‌ డీజీపీ సుప్రీంకోర్టుకు సమర్పిస్తారని ప్రభుత్వం పేర్కొంది. బాధిత యువతి ఇంటి చుట్టూ ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది యూపీ సర్కార్‌.. కుటుంబసభ్యులకు, సాక్షులకు 16 మంది పోలీసులతో రక్షణ ఏర్పాటు చేసినట్టు పేర్కొంది.. అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తగా క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు యోగి ప్రభుత్వం తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు, సాక్షుల వ్యక్తిగత గోప్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోమని, ఈ విషయంపై అక్కడ కాపలాగా ఉన్న పోలీసులను కూడా ఆదేశించామని తెలిపింది.. వారు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లవచ్చునని, ఎలాంటి ఆటంకాలను కల్పించబోమని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది..