‘రైతు చట్టాల కమిటీ’ పై తొలిసారి స్పందించిన సుప్రీంకోర్టు సీజేఐ ఎస్ఏ. బాబ్డే , అపోహలు తగవు, పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్య

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న రైతుల సమస్యపై తలెత్తిన సంక్షోభ పరిష్కారానికి తాము నియమించిన నలుగురు సభ్యుల కమిటీపై..

  • Umakanth Rao
  • Publish Date - 9:43 am, Wed, 20 January 21
'రైతు చట్టాల కమిటీ' పై తొలిసారి స్పందించిన సుప్రీంకోర్టు సీజేఐ ఎస్ఏ. బాబ్డే  , అపోహలు తగవు, పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్య

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న రైతుల సమస్యపై తలెత్తిన సంక్షోభ పరిష్కారానికి తాము నియమించిన నలుగురు సభ్యుల కమిటీపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే తొలిసారి స్పందించారు.  ఈ కమిటీ ఏర్పాటుపై కొన్ని అపోహలు ఏర్పడ్డాయని, అయితే వాటిపై చర్చ అనవసరమని అన్నారు. ఈ పానెల్ నుంచి ఒక సభ్యుడు వైదొలిగారని, అది ఆయన సొంత నిర్ణయమని అన్నారు. అంతమాత్రాన అది ఆయన అనర్హుడన్న అభిప్రాయం సరికాదన్నారు. ఒక సమస్య పరిష్కారానికి దోహదపడే సభ్యులనే పానెల్ లో నియమిస్తామన్నారు. ఎవరికైనా సొంత అభిప్రాయాలు ఉంటాయన్నారు. కాగా ఈ కమిటీ నుంచి భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ భూపేందర్ సింగ్ మాన్ తప్పుకున్న విషయం గమనార్హం. తాను కూడా రైతునేనని, అన్నదాతల ప్రయోజనాలకు నేను కూడా నా వంతు సాయపడతానంటూ ఆయన కమిటీ నుంచి వైదొలిగారు. అయితే ఏ కమిటీ ముందు కూడా తాము హాజరు కాబోమని, అసలు కోర్టు నియమించిన కమిటీలోని సభ్యులంతా వివాదాస్పద చట్టాలకు అనుకూలురేనని అన్నదాతలు అంటున్నారు. కమిటీలోని ఇతర ముగ్గురు సభ్యులు కూడా వ్యవసాయ వేత్తలే అయినప్పటికీ వారు కేంద్ర చట్టాలను సమర్థిస్తున్నారు.

ఇక బుధవారం రైతులు తమ తాజా కార్యాచరణను నిర్దేశించుకోనున్నారు. ఈ నెల 26 న ట్రాక్టర్ ర్యాలీ వీరి చర్చల్లో ప్రధాన అజెండాగా ఉండనుంది.