ప్రాణాలు తీస్తున్న గడ్డి మందు.. పారాక్వాట్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. 30 రోజుల్లో..

దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగిస్తున్న అత్యంత ప్రమాదకర కలుపు మందు పారాక్వాట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారాక్వాట్ డైక్లోరైడ్‌పై సంపూర్ణ నిషేధం విధించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. దిగుమతి, తయారీ, విక్రయం, రవాణా, పంపిణీ, వినియోగంపై నిషేధం విధించాలని ప్రతిపాదిస్తూ ప్రజలు, నిపుణులు, సంబంధిత వర్గాల నుంచి 30 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు వెల్లడించింది.

ప్రాణాలు తీస్తున్న గడ్డి మందు.. పారాక్వాట్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. 30 రోజుల్లో..
Paraquat Herbicide Sale

Updated on: Jul 15, 2026 | 9:55 AM

వ్యవసాయంలో విస్తృతంగా వినియోగించే అత్యంత ప్రమాదకర కలుపు మందు పారాక్వాట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. విరుగుడు లేని ఈ రసాయనంపై దేశవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో పలు వివరాలను వెల్లడించింది. నేటి నుంచి దేశంలోకి దిగుమతి, తయారీ, అమ్మకం, రవాణా, వినియోగంపై నిషేధం ఉంటుందని తెలిపింది. దీనిపై ప్రజలు, నిపుణులు, సంబంధిత వర్గాల నుంచి 30 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనుంది.

పారాక్వాట్ అత్యంత డెడ్లీ కెమికల్‌. స్వల్ప మోతాదులో శరీరంలోకి వెళ్లినా ప్రాణాలకు ముప్పే. ఇది ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు, ఎక్కువకాలం దీని ప్రభావానికి గురైనవారిలో పార్కిన్సన్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రైతుల ఆత్మహత్యలకు ఈ గడ్డి మందు వినియోగిస్తుండడం ఆందోళనకరం. ఈ విషయంపై వైద్య, వ్యవసాయ నిపుణులు చాలాకాలంగా అనేక సందర్భాల్లో కేంద్రానికి లేఖలు కూడా రాశారు. కలుపు మందుపై నిషేధం విధించాలని పర్యావరణవేత్తలు సైతం సూచించారు..

ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలు ఇప్పటికే పారాక్వాట్‌ను నిషేధించగా, భారత్ కూడా అదే దిశగా ముందుకు సాగుతోంది. తుది నోటిఫికేషన్ అమల్లోకి వస్తే పారాక్వాట్ దిగుమతి, తయారీ, విక్రయం, రవాణా, పంపిణీ, వినియోగం దేశవ్యాప్తంగా పూర్తిగా చట్టవిరుద్ధం కానుంది.

కాగా.. ఇప్పటికే.. పలు రాష్ట్రాల్లో గడ్డి మందుపై నిషేధం కూడా కొనసాగుతోంది. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందని పలువురు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us