చెరకు రైతుల సమస్యలపై కేంద్రం కీలక నిర్ణయం.. రమేశ్ చంద్ర నేతృత్వంలో కమిటీ ఏర్పాటు

చెరకు రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ రమేశ్ చంద్ర నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. చెరకు గిట్టుబాటు ధర, చక్కెర మిల్లుల కనీస విక్రయ ధర, చక్కెర రికవరీ, చెరకు తూకాల్లో పారదర్శకత, యాంత్రిక కోత వల్ల కలిగే నష్టాలపై కమిటీ అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుంది.

చెరకు రైతుల సమస్యలపై కేంద్రం కీలక నిర్ణయం.. రమేశ్ చంద్ర నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
Sugarcane Farmer

Updated on: Oct 14, 2026 | 7:23 PM

చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి తగిన సిఫార్సులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ రమేశ్ చంద్ర ఈ కమిటీకి అధ్యక్షత వహించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ద్వారా వెల్లడించింది. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన చెరకు రైతుల ప్రతినిధులు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రితో సమావేశమైన అనంతరం ఈ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

చెరకు రైతులకు గిట్టుబాటు ధరపై పరిశీలన

చెరకు సాగు ఖర్చులు, ఇతర సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుని రైతులకు మరింత మెరుగైన ప్రతిఫలం అందించాలన్న డిమాండ్‌ను కమిటీ పరిశీలించనుంది. అలాగే చక్కెర ఉత్పత్తి వ్యయం, మార్కెట్‌లో లభిస్తున్న ధరలు, చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌-మిల్‌ కనీస విక్రయ ధర (MSP) సవరణ అవసరాన్ని కూడా అధ్యయనం చేయనుంది.

చక్కెర రికవరీ, తూకాల్లో పారదర్శకత

చక్కెర రికవరీ శాతాన్ని పరీక్షించే, నమోదు చేసే ప్రస్తుత విధానాలను కమిటీ సమీక్షించనుంది. రికవరీ వివరాల నిర్ధారణలో పారదర్శకతను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయనుంది. చక్కెర మిల్లుల్లో చెరకు తూకం వేసే విధానాలు, తూకపు యంత్రాల క్రమబద్ధీకరణ, తనిఖీలు, ధ్రువీకరణ వ్యవస్థలు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయన్న అంశాలను కూడా పరిశీలించనుంది. యంత్రాల ద్వారా కోత కోసిన చెరకులో బరువు తగ్గింపునకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడంతో పాటు, యాంత్రిక కోత కారణంగా వాస్తవంగా ఎంత నష్టం జరుగుతోంది? ఆ నష్టం రైతులకు చెల్లించే చెరకు ధరపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? అనే అంశాలను విశ్లేషించనుంది. అవసరమైతే ఇతర సంబంధిత అంశాలనూ పరిశీలించనుంది.

రైతులు, మిల్లుల ప్రతినిధులతో సంప్రదింపులు

ఈ కమిటీ రైతు సంఘాల ప్రతినిధులు, చక్కెర మిల్లుల సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు, ఇతర సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరపనుంది. తన పరిశీలనలతో పాటు నిర్దిష్ట సిఫార్సులతో కూడిన నివేదికను వీలైనంత త్వరగా సమర్పించనుంది. అనంతరం సంబంధిత అధికారం ఆ నివేదికను పరిశీలించనుంది.

కమిటీలో ఎవరెవరు ఉన్నారు?

ప్రొఫెసర్ రమేశ్ చంద్ర వ్యవసాయ ఆర్థిక శాస్త్రం, ప్రజా విధానాల నిపుణుడు. ఆయన 2015 నుంచి 2026 వరకు నీతి ఆయోగ్ సభ్యుడిగా పనిచేశారు. గతంలో ICAR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అండ్ పాలసీ (NIAP) డైరెక్టర్‌గా, 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ కమిటీలో వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వ్యవసాయ కమిషనర్, ఆహార, ప్రజా పంపిణీ శాఖ జాయింట్ సెక్రటరీ (షుగర్), వినియోగదారుల వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ (లీగల్ మెట్రాలజీ) సభ్యులుగా ఉన్నారు. చెరకు సాగు ఖర్చులు, రైతులకు లభించే ధర, చక్కెర రికవరీ, తూకాల్లో పారదర్శకత వంటి కీలక అంశాలపై ఈ కమిటీ చేసే సిఫార్సులు చెరకు రైతుల సమస్యల పరిష్కారంలో ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us