
బీహార్‌లో చోటుచేసుకున్న ఒక అత్యంత క్రూరమైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నవాడా జిల్లాలో 15 ఏళ్ల పాఠశాల విద్యార్థి వంశ్‌రాజ్ దారుణ హత్యకు గురైన తీరు మానవత్వాన్నే ప్రశ్నిస్తోంది. ముఫుస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోన్వా గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ సిన్హా ఏకైక కుమారుడైన వంశ్‌రాజ్, శుక్రవారం (మే 08) పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం వరకు వేచి చూసిన కుటుంబ సభ్యులు ఆందోళనతో వెతకగా, అతని బ్యాగ్ పాఠశాలలోనే ఉందని తెలిసింది.
విచారణలో వంశ్‌రాజ్ తన ఐదుగురు స్నేహితులతో కలిసి సమీపంలోని గోని పహార్ క్వారీ వద్దకు వెళ్లినట్లు తేలింది. సాయంత్రం నలుగురు స్నేహితులు తిరిగి వచ్చారు కానీ వంశ్‌రాజ్ రాలేదు. ఆ స్నేహితులను ప్రశ్నించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. మొదట అతను గనిలో మునిగిపోయాడని చెప్పిన వారు, ఆ తర్వాత రాజ్‌గిర్ వాటర్ పార్క్‌లో మునిగిపోయాడని మాట మార్చారు. ఈ ప్రవర్తన కుటుంబ సభ్యులకు వారిపై అనుమానం కలిగేలా చేసింది.
శనివారం (మే 09) గనిలోని నీటిలో వంశ్‌రాజ్ మృతదేహం తేలుతూ కనిపించింది. మృతదేహాన్ని వెలికి తీసిన గ్రామస్తులు అక్కడ కనిపించిన దృశ్యానికి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ బాలుడి చెవిలో స్క్రూడ్రైవర్ వంటి పదునైన వస్తువును గుచ్చి ఉంది. ఒక కన్ను బయటకు వచ్చేలా పొడిచి ఉంది. శరీరంపై అనేక గాయాలు ఉండటం చూస్తుంటే, అతడిని అతి దారుణంగా హింసించి హత్య చేసినట్లు స్పష్టమవుతోంది. ఆ కుటుంబానికి ఏకైక వారసుడైన వంశ్‌రాజ్ మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు గోన్వా దీహ్ ప్రధాన రహదారిపై టైర్లు తగలబెట్టి ధర్నాకు దిగారు. పోలీసు యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హంతకులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నవాడా ఎస్పీ అభినవ్ ధిమాన్ స్వయంగా రంగంలోకి దిగి గ్రామస్తులను శాంతపరిచారు.
పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్ (FSL) బృందంతో ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం అనుమానితులైన స్నేహితులను విచారిస్తున్నారు. మొబైల్ లొకేషన్లు, సాంకేతిక ఆధారాల ద్వారా ఈ దారుణానికి పాల్పడింది ఎవరనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. అమాయక బాలుడిని ఇంతటి క్రూరత్వంతో చంపిన నిందితులకు కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..