ప్రధాని మోదీతో ఎప్పుడూ మనస్ఫూర్తిగా మాట్లాడలేదు.. సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు!

మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'లో ఆమె ప్రధాని మోదీతో తనకున్న సంబంధాలు, రాజకీయ విభేదాలు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, బీజేపీ రాజకీయ లక్ష్యాలపై పలు కీలక విషయాలను వెల్లడించారు. హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకం నవంబర్ 10న పాఠకులకు అందుబాటులోకి వచ్చింది.

ప్రధాని మోదీతో ఎప్పుడూ మనస్ఫూర్తిగా మాట్లాడలేదు.. సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Sonia Gandhi, Pm Modi

Updated on: Nov 10, 2026 | 12:33 PM

న్యూఢిల్లీ, నవంబర్ 10: మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో ఆమె ప్రధాని మోదీతో తనకున్న సంబంధాలు, రాజకీయ విభేదాలు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, బీజేపీ రాజకీయ లక్ష్యాలపై పలు కీలక విషయాలను వెల్లడించారు. హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకం నవంబర్ 10న పాఠకులకు అందుబాటులోకి వచ్చింది.

మోదీతో ఎలాంటి నిజమైన సంభాషణ లేదు: సోనియా

ప్రధాని నరేంద్ర మోదీతో తనకు ఇప్పటివరకు ఎలాంటి నిజమైన రాజకీయ సంభాషణ జరగలేదని సోనియా గాంధీ తన పుస్తకంలో పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా స్పీకర్ ఛాంబర్‌లో జరిగే సంప్రదాయ సమావేశాల్లో మాత్రమే ఇద్దరూ ఎదురుపడతారని తెలిపారు. అలాంటి సందర్భాల్లో మోదీ తనకు లాంఛనంగా నమస్కారం చేస్తారని, అయితే కళ్లలోకి చూస్తూ మాట్లాడలేదని రాశారు.

గతంలో భిన్న రాజకీయ సిద్ధాంతాలు కలిగిన నాయకుల మధ్య కూడా వ్యక్తిగతంగా ఆప్యాయత, పరస్పర గౌరవం ఉండేవని, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు. తాను ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన సందర్భాల్లో మోదీ ఆరోగ్యం గురించి అడిగేవారని, దానికి తాను సమాధానం ఇచ్చేదాన్నని గుర్తుచేసుకున్నారు. పుట్టినరోజు, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడం మినహా తమ మధ్య పెద్దగా సంభాషణలు జరగలేదని వెల్లడించారు.

భారత్‌పై ఇద్దరివీ భిన్నమైన దృక్పథాలు

భారతదేశ భవిష్యత్తుపై ప్రధాని మోదీ, తనకు పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని సోనియా పేర్కొన్నారు. వైవిధ్యం, లౌకికవాదం, సమానత్వం, సామాజిక న్యాయం, అన్ని మతాలు, భాషలు, సంస్కృతులకు సమాన గౌరవం కల్పించే భారతదేశం తన ఆకాంక్ష అని వివరించారు. మరోవైపు మోదీ ఆలోచనా విధానం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రభావంతో రూపుదిద్దుకుందని విమర్శించారు. ‘ఆయన తన భారతదేశ దృక్పథం కోసం పోరాడారు.. నేను నా దృక్పథం కోసం పోరాడాను’ అని ఆమె పేర్కొన్నారు. ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడి, సమ్మిళితత్వం, లౌకికవాదం, సామాజిక న్యాయం కోసం తాను పోరాడుతున్నట్లు వివరించారు.

ప్రధాని మోదీ నేపథ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానం తనకు భిన్నమైనదని పేర్కొన్న సోనియా.. ఆర్ఎస్ఎస్‌లో ఎదగడానికి, అధికారాన్ని సంపాదించడానికి ఆయన ఎంతో కష్టపడి ఉంటారని అంగీకరించారు. అయితే, మోదీ ప్రారంభ జీవితం గురించి ఆయన పీఆర్ బృందం ప్రచారం చేస్తున్న చిత్రణకు వాస్తవ పరిస్థితులు పూర్తిగా సరిపోకపోవచ్చని వ్యాఖ్యానించారు.

నెహ్రూపై విమర్శలు, కాంగ్రెస్ రహిత భారత్

పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగాల శైలిని కూడా సోనియా విమర్శించారు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం, బహిరంగ సభల్లో ఉపయోగించే కఠినమైన భాషను పార్లమెంట్‌లోనూ ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. బీజేపీ, సంఘ్ పరివార్ వర్గాలు దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను తరచూ లక్ష్యంగా చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని, దాని భావజాలాన్ని దేశ రాజకీయాల నుంచి తొలగించాలనే లక్ష్యం వెనుక ఆర్ఎస్ఎస్ సిద్ధాంత ప్రభావం ఉందని ఆమె ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ శిక్షణ, ఆలోచనలు బీజేపీ రాజకీయ వైఖరిని ప్రభావితం చేస్తున్నాయని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

హిందూ మత సంప్రదాయాలపై ప్రస్తావన

తన అత్త, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ద్వారా భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల గురించి తెలుసుకున్న విషయాలను సోనియా వివరించారు. హిందూ మతంలోని భిన్నమైన ఆచారాలు, విశ్వాసాలు, సంప్రదాయాల వైవిధ్యాన్ని ప్రస్తావించారు. మహాత్మా గాంధీ బోధించిన అహింస, ధర్మ సూత్రాలు తన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేశాయని తెలిపారు. అదే సమయంలో కుల వ్యవస్థలోని అసమానతలు, అణచివేతను ప్రశ్నించారు.

మొత్తంగా సోనియా గాంధీ ఆత్మకథలోని ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య కొనసాగుతున్న సైద్ధాంతిక పోరును మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా ప్రధాని మోదీతో తన సంబంధాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు, భారతదేశంపై ఇద్దరి భిన్న దృక్పథాల గురించి చేసిన విశ్లేషణలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us