బిచ్చమెత్తుకుని బతికింది.. మరణం తర్వాత ఆమె నివాసంలో వెతకగా..

జీవితాంతం బిచ్చమెత్తుకుంటూ గడిపిన ఓ వృద్ధురాలు మరణించిన తర్వాత ఆమె ఇంట్లో రూ.8 లక్షలకు పైగా నగదు బయటపడటం మండ్యలో సంచలనం సృష్టించింది. నోట్ల కట్టలు, నాణేల గుట్టలు చూసి బంధువులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

బిచ్చమెత్తుకుని బతికింది.. మరణం తర్వాత ఆమె నివాసంలో వెతకగా..
Beggar Woman

Edited By:

Updated on: Aug 24, 2026 | 5:06 PM

కర్ణాటకలోని మండ్య నగరంలో ఓ వృద్ధురాలి జీవితం, ఆమె మరణం తర్వాత బయటపడిన నిజాలు ఇప్పుడు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జీవించి ఉన్నంతకాలం బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగించిన ఆ వృద్ధురాలు.. ఎన్నేళ్లుగా కూడబెట్టిన డబ్బును ఇంట్లోనే దాచిపెట్టినట్లు తెలుస్తోంది. ఆమె మరణానంతరం ఇంట్లో కుప్పలుగా నాణేలు, నోట్ల కట్టలు బయటపడటంతో అందరూ షాక్‌కు గురయ్యారు. లెక్కించగా రూ.8 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు సమాచారం.

బిచ్చమెత్తుకుంటూ జీవనం

మండ్య నగరంలోని గుట్టలు ప్రాంతానికి చెందిన హుర్ (నూర్‌గా కూడా స్థానికులు పిలుస్తున్నట్లు సమాచారం) అనే వృద్ధురాలు కొన్నేళ్లుగా బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఆమెను సరిగా పట్టించుకోకపోవడంతోనే ఆమె ఇలా జీవించాల్సి వచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంత్యక్రియల తర్వాత బయటపడ్డ రహస్యం

వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హుర్ ఇటీవల మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు పూర్తైన తర్వాత బంధువులు, స్థానికులు ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం వారిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంటి లోపల నోట్ల కట్టలు, భారీగా నాణేలు కనిపించాయి. వాటిని అందరూ కలిసి లెక్కించగా రూ.8 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు గుర్తించారు. ఎన్నేళ్లుగా బిచ్చమెత్తుకుని హుర్ కూడబెట్టిన డబ్బేనని స్థానికులు భావిస్తున్నారు.

బతికున్నప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు డబ్బు కోసం?

హుర్ జీవించి ఉన్న సమయంలో ఆమెను కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె మరణం తర్వాత ఇంట్లో భారీ మొత్తంలో నగదు బయటపడటంతో బంధువులు అక్కడికి చేరుకుని ఆ డబ్బుపై హక్కుల కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నగదును పంచుకునేందుకు పంచాయతీ కూడా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. బతికున్నప్పుడు ఆమెను పట్టించుకోని వారు.. ఇప్పుడు ఆమె దాచుకున్న డబ్బు కోసం రావడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం మండ్యలో చర్చనీయాంశంగా మారింది.

అసలు మొత్తం ఎంత?

ఈ ఘటన మండ్య ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నట్లు సమాచారం. హుర్ వద్ద ఈ నగదు ఎప్పటి నుంచి ఉంది? అసలు మొత్తం ఎంత? ఇంట్లో ఆమె డబ్బును ఎక్కడెక్కడ దాచిపెట్టింది? అనే అంశాలపై బంధువులు ఇంకా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఘటన కర్ణాటక వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us