
ఆయోధ్య రామ మందిర విరాళాల దొంగతనం కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. నిందితుడు అవినాష్ శుక్లాను పోలీసు రిమాండ్‌లో భాగంగా ఘటనలకు సంబంధించిన ప్రాంతాలకు తీసుకెళ్లిన అయోధ్య పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. దొంగిలించిన విరాళాల నగదును ఇతర నిందితులకు పంచిపెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రదేశాన్ని అవినాష్ శుక్లా గుర్తించినట్లు సమాచారం
అయోధ్యలోని 14-కోసి పరిక్రమ మార్గం సమీపంలోని ప్రాంతానికి పోలీసులు అవినాష్ శుక్లాను తీసుకెళ్లారు. అక్కడే దొంగిలించిన నగదును అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, కమలేష్ పాండే, టిను యాదవ్‌తో పాటు ఇతర నిందితులకు పంచిపెట్టినట్లు అతను విచారణలో వివరించినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలోనే నిందితుడిని ప్రశ్నించిన అధికారులు, మొత్తం ఘటనను పునర్నిర్మించి డబ్బు ఎలా పంపిణీ చేశారనే అంశాలపై వివరాలు సేకరించారు.
దర్యాప్తు బృందం తెలిపిన సమాచారం ప్రకారం, అదే ప్రాంతాన్ని కేసుకు సంబంధించిన విలువైన వస్తువులను దాచిపెట్టేందుకు కూడా ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. అవినాష్ శుక్లా ఇచ్చిన సమాచారంతో అక్కడి సమీపంలో దాచిపెట్టిన ఒక విలువైన వస్తువును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఏమిటన్న విషయాన్ని అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. ఈ స్వాధీనం కేసు దర్యాప్తులో కీలక సాక్ష్యంగా మారే అవకాశం ఉందని వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక దర్యాప్తులో మరో కీలక పరిణామంగా, ఆలయ విరాళాల డబ్బుతో కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్న మారుతి బ్రెజ్జా ఎస్‌యూవీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాన్ని అవినాష్ శుక్లా సోదరుడు అభిషేక్ పేరుతో రిజిస్టర్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. విరాళాల నగదును అక్రమంగా వినియోగించి ఈ వాహనం కొనుగోలు చేసినట్లు అనుమానిస్తూ దర్యాప్తు అధికారులు ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
ఈ కేసు ఆలయానికి భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి తదితర విరాళాల దుర్వినియోగం ఆరోపణల చుట్టూ తిరుగుతోంది. ఆలయ విరాళాల నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంలో ఆలయ ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా చేసిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అయోధ్యలోని న్యాయవాదులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు ఆలయ విరాళాల సేకరణ, లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అవినాష్ శుక్లా వద్ద నుంచి రూ.20.39 లక్షలు, కరుణేష్ పాండే వద్ద నుంచి రూ.18.07 లక్షలు, అనుకల్ప్ మిశ్రా వద్ద నుంచి రూ.16.82 లక్షలు, లవ్‌కుష్ మిశ్రా వద్ద నుంచి రూ.14.25 లక్షలు, టిను అలియాస్ రామశంకర్ మిశ్రా వద్ద నుంచి రూ.7.32 లక్షలతో పాటు సుమారు 11 గ్రాముల బంగారం, 375 గ్రాముల వెండి, 1,121 అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంకా మరిన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…