
అయోధ్య, జూన్ 26: అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించిన విరాళాలు చోరీ చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుల్లో ఆరుగురు ఆలయ సిబ్బందే కావడం గమనార్హం. విరాళాల లెక్కింపు బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు ఉద్యోగులు నగదును అక్రమంగా స్వాహా చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులుగా అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, రామ్‌శంకర్ మిశ్రా, రామాశంకర్ యాదవ్, మనీష్ యాదవ్, సుభాష్ చంద్ర శ్రీవాస్తవ, కరుణేశ్ పాండే పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆలయ విరాళాల నిధుల్లో సుమారు రూ.7 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు నగదు గల్లంతైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రస్ట్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ వ్యవహారంపై తొలిసారిగా సమాజ్‌వాదీ పార్టీ నాయకులు మీడిమా దృష్టికి తీసుకువచ్చారు. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రామాలయ విరాళాల్లో కోట్ల రూపాయలు మాయమవుతున్నాయని ఆరోపిస్తూ న్యాయపరమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వార్తల వెనుక వాస్తవాలను వెలికితీయాలని ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం ప్రభుత్వం SITను నియమించింది.
లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్‌లతో కూడిన ప్రత్యేక బృందం విచారణ చేపట్టి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో కీలక సిఫార్సులు చేసినట్లు సమాచారం. రామాలయ విరాళాల దుర్వినియోగ ఆరోపణలు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ బీజేపీ ఎంపీ Vinay Katiyar ఈ ఆరోపణలను అత్యంత తీవ్రమైనవిగా అభివర్ణించారు. ఇక అరెస్టుల అనంతరం సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి మొహమ్మద్ ఆజమ్ స్పందిస్తూ.. రామాలయంలో చోరీ జరిగిన విషయం ఇప్పుడు అధికారికంగా కేంద్రం అంగీకరించింది. ఇది రామభక్తుల విజయమని వ్యాఖ్యానించారు. కేసులో అరెస్టైన ఎనిమిది మందిని పోలీసులు విచారిస్తున్నారు. విరాళాల నిధుల దుర్వినియోగం ఎంత మేరకు జరిగిందనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.