అటు బాంబ్ బెదిరింపులు.. ఇటు సాంకేతిక సమస్యలు.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో పెరిగిన జాగ్రత్తలు.!

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తరువాత విమాన ప్రయాణాలపై ఫోకస్ పెరిగింది. అటు ఎయిర్‌లైన్ సంస్థలు, ఇటు ప్రయాణికులు ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా ఉంటున్నారు. కొంత ఆలస్యమైనా సరే.. పొరపాట్లు జరగకుండా ఉండాలని అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో విమానాల్లోని సమస్యలు, బాంబు బెదిరింపులు వంటి అంశాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.

అటు బాంబ్ బెదిరింపులు.. ఇటు సాంకేతిక సమస్యలు.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో పెరిగిన జాగ్రత్తలు.!
Ahmedabad Plane Crash

Updated on: Jun 16, 2025 | 9:00 AM

శంషాబాద్‌లోని స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఫ్లైట్‌ నెంబర్‌ SG-2138లో మొదట టెక్నికల్‌ సమస్య అని సిబ్బంది ప్రయాణికులకు తెలిపారు. దీంతో మూడు గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులు భయంతో తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఇక దుబాయ్ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక లోపం కారణంగా విమానం గంటల తరబడి ఆలస్యమైంది. ఆ సమయంలో విమానంలో ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోల్లో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ ఘటన జూన్ 13న చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌ నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సిన ఎయిరిండియా IX 1511 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్‌ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం భద్రతా కారణాలతో తిరిగి వెనక్కి వెళ్లింది. సుమారు రెండు గంటల ప్రయాణం అనంతరం బాంబు బెదిరింపు కారణంగా విమానాన్ని మళ్లీ ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం అర్థరాత్రి హైదరాబాద్‌కు చేరుకోవాల్సిన ఈ విమానాన్ని వెనక్కి మళ్లించారు. రెండు రోజుల క్రితం థాయ్‌లాండ్‌లో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్‌ అయింది. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఏఐ379 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అందులో బాంబు స్క్వాడ్‌ బృందం తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని తేలిన తరువాత ప్రయాణానికి అనుమతిచ్చారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం అటు ప్రయాణికుల ఆందోళన, ఇటు విమానయాన సంస్థలు జాగ్రత్తలతో కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ ఘటనల కారణంగా ఎటొచ్చీ ప్రయాణికులే ఇబ్బందిపడుతున్నారు.