
ఆర్ట్ ఆఫ్ లివింగ్.. నేటితో 45 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బాలీవుడ్ దిగ్గజాలు, చిత్రనిర్మాతలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ‘ఇంట్యూషన్ ఫెస్ట్’ మరో కీలక మైలురాయి కూడా చోటు చేసుకుంది. మంగళవారం (మే 26) జరిగిన ఈ చారిత్రాత్మక ఇంట్యూషన్ ఫెస్ట్‌కు 11,000 మంది పిల్లలు, తల్లిదండ్రులు హాజరయ్యారు. వీరిలో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న 50 మంది మేధావులు కూడా ఉన్నారు.
సినిమా, సాహిత్యం, పరిపాలన, ప్రజా జీవితంతో నేరుగా ముడిపడి ఉన్న అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు అవార్డుల ప్రదానోత్సవం కోసమో, సినిమా విడుదల కోసమో, లేదా ఒక రాజకీయ సదస్సు కోసమో కాకుండా ఇంత పెద్ద సంఖ్యలో ధ్యానం, సేవ, మానవ విలువలను జరుపుకోవడానికి ఒకే వేదికపైకి రావడానికి కారణం ఏమిటి? అనే సందేహం తలెత్తుతుంది. దీనికి బెంగళూరులో జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి 45 ఏళ్ల ఉత్సవాలలో సమాధానం దొరికింది. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, చిత్రనిర్మాతలు రాజ్ కుమార్ హిరానీ, సాజిద్ నడియాద్వాలా, నటుడు విక్రాంత్ మాస్సే, నటుడు-హాస్యనటుడు సునీల్ గ్రోవర్, నటుడు వినీత్ కుమార్ సింగ్, ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్, నిర్మాత మహావీర్ జైన్ వంటి ఎందరో ప్రముఖులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా లక్షలాది మంది జీవితాలపై గురుదేవ్ రవిశంకర్ ‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’ చూపిన ప్రభావం అపారమైంది.
గురుదేవ్ జీవితం ఆధారంగా త్వరలో విడుదలకాబోతున్న ‘వైట్’ మువీలో గురుదేవ్ పాత్ర పోషిస్తున్న విక్రాంత్ మాస్సే మాట్టాడుతూ ‘ఇది (ఆశ్రమం) నా ఇల్లు. నా గురువు, నా సర్వస్వం అయిన గురుదేవ్ పాత్రను పోషించే అవకాశం నాకు లభించింది. ఆ పాత్రకు నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞుడను’ అని అన్నారు. అనంతరం ప్రముఖ చిత్రనిర్మాత రాజ్ కుమార్ హిరానీ.. గురుదేవ్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమ అనుబంధం తన సినిమా నిర్మాణ ప్రక్రియలో ఎలా భాగమైందో వివరించారు. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ఒక ప్రత్యేకమైన శక్తిని అనుభూతి చెందుతాను. సినిమాను ప్రారంభించే ముందు, నేను చిత్ర బృందంలోని ప్రతి సభ్యుడికి సుదర్శన క్రియను నేర్పిస్తానని హిరానీ అన్నారు. ప్రతి ఒక్కరినీ తమలో ఒకరిగా భావించేలా చేసే గురుదేవుని సామర్థ్యం గురించి కొనియాడారు. తొలిసారి నేను గురుదేవుని కలిసినప్పుడు కొంచెం బిడియపడ్డాను. కానీ ఆయన తనను తమలో ఒకరిగా చేసుకున్నారని అన్నారు.
హాస్యనటుడు సునీల్ గ్రోవర్ తాను చివరిసారిగా గురుదేవునితో కలిసి ధ్యానం చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ధ్యానం తర్వాత నా ముఖంలో ఒక రకమైన తేలికదనం వచ్చిందని అనడంతో సభలోని వారంతా నవ్వులు, చప్పట్లతో మారుమోగారు. లక్షలాది మంది జీవితాలపై గురుదేవుని ప్రభావం గురించి రాబోయే ‘వైట్’ చిత్రం లోతైన స్పూర్తిని అందిస్తుందని ఆ మువీ నిర్మాత మహావీర్ జైన్ అన్నారు. 70 ఏళ్లుగా మీ ఆదరాభిమానాలకు ధన్యవాదాలు చెప్పడానికే మేం ఇక్కడకు వచ్చాం. మాలో లక్షలాది మందికి ఎలా జీవించాలో మీరు నేర్పించారని గురుదేవ్‌ని కొనియాడారు. ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ గురుదేవునితో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుత తాను రోజూ చేసే సుదర్శన క్రియ సాధన గురించి వివరించారు. తాను ఆశ్రమానికి మొదటిసారి వస్తున్నప్పటికీ ఆయన తనకు ముందే తెలిసినట్లు అనిపిస్తోందని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి ఉదయం సుదర్శన క్రియను ఆచరిస్తానని, తాను అనుభూతి చెందిన ఆ ప్రకంపనలను మాటల్లో వర్ణించలేనని అన్నారు. ‘ఛావా’, ‘ముక్కాబాజ్’ వంటి హిటీ మువీల్లో నటించిన నటుడు వినీత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. తాను ఇక్కడికి ఇంకా ముందే వచ్చి ఉండాల్సింది అనిపిస్తోందని అన్నారు.
భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లడంలో, దానిని సమకాలీన సమాజానికి ఎంతగానో ఉపయోగపడేలా చేయడంలో గురుదేవ్ చేసిన కృషిని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రశంసించారు. ఇలా జ్ఞానోదయం పొందినవారు తమకోసం తాము జీవించరు. ఇతరులను ఉన్నత స్థితికి చేర్చడమే వారి జీవిత లక్ష్యం. గొప్ప ఆధ్యాత్మిక గురువుల ద్వారా దైవం నిరంతరం వ్యక్తమవుతూనే ఉంటుందనే విషయాన్ని గ్రహించకుండా విష్ణుమూర్తి భూమిపైకి దిగి వస్తాడని మనం ఎదురుచూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆది శంకరాచార్యుల వారి ద్వారా, మన కాలంలో గురుదేవ్ రవిశంకర్ ద్వారా కూడా వ్యక్తమవుతోంది. అటువంటి గొప్ప ఆత్మ సమక్షంలో ఉండటం మన అదృష్టమని గుర్తించడంలో తరచూ విఫలమవుతున్నామని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి వీడియో రికార్డు ద్వారా ‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు. అలాగే స్ట్రెస్ నివారణ కార్యక్రమాలు, యువత సాధికారత కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి, మానవతా సేవ ద్వారా లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేయడంలో ఆ సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు.
మంగళవారం జరిగిన వేడుకల్లో మరో ఆసక్తికరమైన కార్యక్రమం ‘ఇంట్యూషన్ ఫెస్ట్’. ఈ ఫెస్ట్‌లో 11 వేల మందికి పైగా పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇది దేశంలోనే సహజసిద్ధమైన నైపుణ్యాలకు అతిపెద్ద ప్రదర్శన వేదికలలో ఒకటిగా నిలిచింది. ‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వారి ‘ఇంట్యూషన్ ప్రాసెస్’లో నేర్పిన పద్ధతులను క్రమం తప్పకుండా అభ్యసించడం ద్వారా తమ పిల్లలు కళ్లకు గంతలు కట్టుకుని చదవడం, సహజసిద్ధమైన ఆటలు, జ్ఞాపకశక్తి ఆధారిత కార్యకలాపాలు, వేగవంతమైన నమూనా గుర్తింపు అభ్యాసాలు, కళ్లకు గంతలు కట్టుకుని టిక్-టాక్-టో, చిత్రాలను నకలు చేసే అభ్యాసాలను ప్రదర్శించారు. 50 మంది పిల్లలు కళ్లకు గంతలు కట్టుకుని ఆశ్రమం ప్రాంగణం అంతటా సైకిళ్లపై ప్రయాణిస్తూ అద్భుతమైన ప్రదర్శనలు చేశారు. చివరిలో ‘జీవితమంతా ఒక నాటకం. ప్రతి నటుడు దర్శకుడిపై ఒక కన్ను వేసి ఉంచుతాడు. ప్రపంచ దర్శకుడు తన దృష్టిని మీపైనే ఉంచాడని నేను హామీ ఇస్తున్నాను. మీరు కూడా మీ దృష్టిని ఆ ఒక్క ‘దర్శకుడి’పైనే ఉంచండి’ అని గురుదేవ్ సందేశం ఇచ్చారు.