
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తండ్రిని ఉద్దేశించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో దుమారం రేపాయి. బీహార్ రాజధాని పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ఖర్గే తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీహార్ తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సింగ్ 139వ జయంతిని పురస్కరించుకుని పాట్నాలో నిర్వహించిన సదస్సులో మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. ఆ సమయంలో సంతోష్ కుమార్ అనే వ్యక్తి లేచి.. మోదీ ఎక్కడికీ వెళ్లరంటూ నినాదాలు చేశాడు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళం మధ్యే ప్రసంగాన్ని కొనసాగించిన ఖర్గే.. మోదీ దివంగత తండ్రి ప్రస్తావన తెస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది.
ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రధానమంత్రి తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ రాజకీయ హద్దులను దాటేసిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రతిరోజూ అసభ్యకర రాజకీయాల పరిమితులను తుంగలో తొక్కుతుందని విమర్శించారు. మోదీ కుటుంబాన్ని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.