
అక్కడ పార్క్ చేసి ఉన్న స్కూటర్‌లోకి పాము దూరింది. ఈ ఘటనను సమీపంలో ఉన్న ఓ వ్యక్తి గమనించారు. ఆ వాహనం వ్యక్తిని అలెర్ట్ చేద్దామంటే అందుబాటులో లేరు. సరే.. మనకెందుకులే అని ఆ వ్యక్తి వెళ్లిపోలేదు. ఈ స్కూటర్‌లోకి పాము దూరింది అంటూ ఓ అలెర్ట్ నోట్ రాసి ఆ స్కూటీపై పెట్టి వెళ్లాడు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది.
తెన్నూర్‌కు చెందిన న్యాయవాది గణపతి మంగళవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు కాంప్లెక్స్ ముందు తన స్కూటర్‌ను పార్క్ చేసి, తన కేసులను చూసుకోవడానికి లోపలికి వెళ్లాడు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో, అతని జూనియర్ స్కూటర్ సీటుపై దొరికిన కాగితపు ముక్కతో లోపలికి వచ్చాడు. ఆ నోట్‌లో “ఈ వాహనం లోపల పాము ఉంది” అని రాసి ఉంది. అంతేకాదు ఆ నోట్‌పై తేదీ, సమయంతో పాటు వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను కూడా క్లియర్‌గా పేర్కొన్నారు.స్లిప్ ఎగిరిపోకుండా ఉండటానికి దానిపై ఒక చిన్న రాయిని ఉంచారు. షాక్‌కు గురైన గణపతి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక తనిఖీ నిర్వహించారు కానీ పామును కనుగొనలేకపోయారు.న్యాయవాది పట్టుబట్టడంతో, వారు స్కూటర్ భాగాలను విడదీసి క్షుణ్ణంగా శోధించారు. చివరికి ఒక చిన్న పాము ఇండికేటర్ అసెంబ్లీ వెనుక దాక్కుని కనిపించింది. అగ్నిమాపక సిబ్బంది ఆ పామును జాగ్రత్తగా పట్టుకుని, దానిని ఒక సంచిలో భద్రపరిచి, ప్రాంగణం నుంచి తీసుకెళ్లారు.
ఆపి ఉంచిన స్కూటర్‌లోకి పాము ప్రవేశించడాన్ని గుర్తుతెలియని వ్యక్తి గమనించి, యజమానిని అప్రమత్తం చేసి, ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఆ నోట్‌ను ఉంచినట్లు అర్థమవుతుంది. ఈ సంఘటన కోర్టు ప్రాంగణంలో కలకలం సృష్టించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..