
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కొడుకు ఇంటికి వెళ్తూ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన 75 ఏళ్ల వృద్ధురాలు రెండు రోజుల పాటు అందులోనే చిక్కుకుపోయి చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. ఆహారం, నీరు లేకుండా చీకటి బావిలో ప్రాణాల కోసం పోరాడిన ఆమెను స్థానిక యువకులు, పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు.
చంద్‌వాడ్‌కు చెందిన చంద్రభాగ ధులాజీ వార్కటే (75) ఆగస్టు 29న తన కొడుకు ఇంటికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. అయితే చాంద్‌వాడ్ బస్‌స్టాండ్ సమీపంలో ప్రమాదకరంగా ఉన్న ఓ బావిలో ప్రమాదవశాత్తు జారి పడిపోయారు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె రెండు రోజులుగా కనిపించకుండా పోయినట్లు భావించారు.
బావిలో పడిపోయిన చంద్రభాగకు బయటకు వచ్చే మార్గం లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు. అయితే అదృష్టవశాత్తూ బావిలో ఉన్న కారు పైపు, తాడును పట్టుకుని ఆమె తనను తాను నిలబెట్టుకున్నారు. ఆహారం, నీరు లేకపోయినా రెండు రోజుల పాటు ధైర్యంగా ప్రాణాలు నిలుపుకున్నారు.
ఇదిలా ఉండగా, బావి సమీపంలో తిరుగుతున్న కొందరు స్థానిక యువకులు లోపలికి చూడగా చంద్రభాగ కనిపించారు. వెంటనే యువకుడు గణేష్ పర్వే పోలీసులకు సమాచారం అందించారు. చంద్‌వాడ్ పోలీసులు, మున్సిపల్ కౌన్సిల్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తమ ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా స్థానిక యువకులు బావిలోకి దిగి, మంచం సహాయంతో చంద్రభాగను పైకి తీసుకొచ్చారు. అనంతరం ఆమెను వెంటనే పింపల్‌గావ్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
చంద్రభాగ బావిలో ఎలా పడిపోయారనే దానిపై చంద్‌వాడ్ పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు, బస్‌స్టాండ్ సమీపంలో ఇలాంటి ప్రమాదకరమైన బావులు ఉండటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని చెబుతూ, తెరిచి ఉన్న బావుల చుట్టూ వెంటనే రక్షణ కంచెలు, భద్రతా వలలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. రెండు రోజుల పాటు చీకటి బావిలో ఆహారం, నీరు లేకుండా పోరాడి 75 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలతో బయటపడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..