ధోని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్…

Dhoni To Remain Unavailable For Indian Selection Committe Until November, ధోని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్…

ప్రపంచకప్ ముగిసిన తర్వాత మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని క్రికెట్‌కు తాత్కాలిక విరామం పలికిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం ధోని.. ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉంటున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు దూరమైన అతడు స్వదేశంలో జరుగుతున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ధోని సెలక్షన్ కమిటీకి నవంబర్ వరకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. సెప్టెంబర్‌ 24 నుంచి జరగనున్న విజయ్‌ హజారే ట్రోఫీ, నవంబర్‌లో స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు కూడా అతడు దూరంగా ఉండనున్నాడని సమాచారం.

ఇటీవల ధోని గురించి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. 2016లో టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆస్ట్రేలియాతో తలపడ్డ మ్యాచ్‌లో ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ కోహ్లీ పోస్ట్‌ చేశాడు. ‘నేను ఎన్నటికీ మరిచిపోలేని మ్యాచ్ ఇది. ప్రత్యేకమైన రోజది. ఫిటెనెస్‌ పరీక్షలో పరిగెత్తించినట్టు ధోనీ నన్ను పరుగులు పెట్టించాడు.’ అని ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడని.. కోహ్లీకి ఈ విషయం గురించి ముందే చెప్పాడని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చించారు. అయితే ధోని రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లేనని అతడి భార్య సాక్షి కొట్టిపారేయడంతో ఊహాగానాలకు తెరపడింది.

మరోవైపు సఫారీ సిరీస్ ప్రారంభమయ్యే ముందు ధోని గురించి విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ‘ధోనీ ఇంకా జట్టుకోసం ఆలోచిస్తున్నాడు. అతడు టీమ్‌ఇండియాకు ఎంతో విలువైన ఆటగాడు, రిటైర్మెంట్‌ అనేది వ్యక్తిగత నిర్ణయం. ఆ విషయంపై ఇతరులెవరూ మాట్లాడిల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నాడు. అటు ధోని రిటైర్మెంట్‌పై ఇప్పటికే పలువురు మాజీలు స్పందించారు. అతని నిర్ణయం ఏంటో సెలక్షన్ కమిటీకి తెలియజేయాలని సూచించారు. చూడాలి మరి మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ఈ వార్తలపై ఎప్పుడు స్పందిస్తారో.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *