
చలికాలంలో చర్మం పగలడం, దురద రావడం, తెల్లగా పొట్టు రాలడం వంటి సమస్యలు సాధారణం. చాలామంది ఇవి చలి వల్ల వస్తున్నాయని భావిస్తారు, కానీ కొన్నిసార్లు మనం చేసే స్నానపు అలవాట్లే చర్మాన్ని దెబ్బతీస్తాయి. ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు చలికాలంలోని స్నానపు అలవాట్లను 1 నుంచి 10 వరకు రేటింగ్ ఇస్తూ, చర్మానికి ఏది మంచిదో, ఏది చెడ్డదో వివరించారు.
మరీ వేడి నీటితో స్నానం: వేడి నీరు చర్మంలోని సహజ నూనెలను తొలగించి చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. దీనివల్ల దురద, చర్మం పగిలే సమస్య పెరుగుతుంది. గోరువెచ్చని నీటికి 10/10 రేటింగ్ ఇచ్చారు. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తూనే తేమను కాపాడుతుంది.
యాంటీసెప్టిక్ సబ్బులు, సువాసన బాడీ వాష్‌లు: యాంటీసెప్టిక్ సబ్బులు చర్మంలోని మంచి బ్యాక్టీరియాను కూడా నశింపజేసి, పొడిబారే సమస్యను తీవ్రతరం చేస్తాయి. సువాసన ఉండే బాడీ వాష్‌ల వల్ల చర్మంలో ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంది. సున్నితమైన, మాయిశ్చరైజింగ్ సబ్బులు వాడటం మంచిది.
రోజూ లూఫా వాడటం: ప్రతిరోజూ లూఫాతో రుద్దడం వల్ల కంటికి కనిపించని సూక్ష్మ గాయాలు ఏర్పడి, చర్మం పొడిబారడం, ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతాయి. వారానికి ఒక్కసారి మాత్రమే సున్నితంగా వాడాలి.
రోజుకు రెండుసార్లు స్నానం: చలికాలంలో చెమట, దుమ్ము తక్కువగా ఉంటాయి కాబట్టి రెండుసార్లు స్నానం అవసరం లేదు. ఒకసారే సరిపోతుంది.
బాత్రూమ్‌లో తడి టవల్ ఉంచడం: గాలి తగలని బాత్రూమ్‌లో తడి టవల్ ఉంచితే ఫంగస్ ఏర్పడి, చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. టవల్‌ను ఎండలో లేదా గాలిలో ఆరబెట్టాలి, వారానికి రెండుసార్లు ఉతకాలి.
స్నానం చేసిన 2–3 నిమిషాలలోపే, చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాయడం వల్ల తేమ చర్మంలో లాక్ అవుతుంది. అలాగే మాయిశ్చరైజర్‌లో 2–3 చుక్కల గ్లిజరిన్ కలిపి రాస్తే చర్మానికి అదనపు తేమ అంది, పొడిబారే సమస్య తగ్గుతుంది.