
శీతాకాలం రాగానే జలుబు, ముక్కు కారడం, గొంతు నొప్పి రావడం సహజం. కానీ వీటన్నింటి కంటే చెవి నొప్పి చాలా బాధాకరంగా ఉంటుంది. లోపల ఎవరో సూదితో గుచ్చినట్లుగా నొప్పి రావడం, ముఖ్యంగా రాత్రి సమయంలో తీవ్రమై నిద్రలేకుండా చేయడం పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఇబ్బంది పెడుతుంది. సరైన సమయంలో కారణాన్ని గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అసలు చలికాలంలో చెవి నొప్పి ఎందుకు పెరుగుతుంది, దీనికి ఇంటి చిట్కాలేమిటో తెలుసుకుందాం.
చల్లని గాలి: చెవులపై కొవ్వు పొర ఉండదు. అందువల్ల చల్లని గాలి నేరుగా చెవి లోపలికి వెళ్లి నరాలు కుంచించుకుపోయి నొప్పి మొదలవుతుంది.
జలుబు: జలుబుతో ముక్కు మూసుకుపోయినప్పుడు, ముక్కు-చెవిని కలిపే నాళం కూడా మూసుకుపోయి లోపల గాలి, ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది.
చెవిలో నీరు: వేడి నీటితో స్నానం చేసేటప్పుడు చెవిలో నీరు నిలిచిపోతే ఇన్ఫెక్షన్ రావచ్చు.
చెవి గులిమి: చలికి చెవిలోని గులిమి ఎండిపోయి గట్టిపడటం వల్ల కర్ణభేరిపై ఒత్తిడి కలిగి బరువుగా, నొప్పిగా అనిపిస్తుంది.
చెవి నొప్పిని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెవిలో సూది గుచ్చినట్లు నొప్పి, బరువుగా అనిపించడం, వినికిడి తగ్గడం, ఈల వేసినట్లు శబ్దం రావడం, జ్వరం లేదా పిల్లలు పదేపదే చెవి గోక్కుంటూ ఏడవడం వంటివి గమనించాలి. ఒకవేళ చెవి నుంచి పసుపు రంగు నీరు లేదా చీము వస్తే అది ఇన్ఫెక్షన్ లక్షణం కాబట్టి ఇంటి చిట్కాలు ప్రయత్నించకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి.
వెచ్చని కాపడం: ఒక శుభ్రమైన గుడ్డను వేడి చేసి లేదా వేడినీళ్ల బాటిల్‌ను గుడ్డలో చుట్టి చెవిపై 10 నిమిషాలు కాపడం పెడితే నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
టోపీ మఫ్లర్: చలిలో బయటకు వెళ్లేటప్పుడు చెవులు పూర్తిగా కవరయ్యేలా ఉన్ని టోపీ లేదా మఫ్లర్ ధరించాలి.
పడుకునే విధానం: నొప్పి ఉన్న చెవి వైపు తిరిగి పడుకోకూడదు. నొప్పి ఉన్న చెవి పైకి ఉండేలా పడుకుంటే చెవిపై ఒత్తిడి తగ్గుతుంది.
వెల్లుల్లి నూనె: 2 చెంచాల ఆవనూనెలో 2 వెల్లుల్లి రెబ్బలు వేసి నల్లబడే వరకు వేడి చేయాలి. స్టవ్ ఆపి, నూనెను వడకట్టి గోరువెచ్చగా అయ్యాక నొప్పి ఉన్న చెవిలో 2 చుక్కలు వేయాలి. వెల్లుల్లిలోని యాంటీబయాటిక్ గుణాలు ఇన్ఫెక్షన్ను తగ్గిస్తాయి.
తులసి రసం: 4-5 తులసి ఆకుల నుంచి రసం తీసి 2 చుక్కలు చెవిలో వేస్తే నొప్పి, ఇన్ఫెక్షన్ రెండూ తగ్గుముఖం పడతాయి.
ఈ సహజమైన ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా చలికాలంలో చెవి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. అయితే నొప్పి రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా కొనసాగితే మాత్రం తప్పనిసరిగా ఈఎన్టీ వైద్య నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..