మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా.. మీ మనసు చెప్పే రహస్యం ఏంటో తెలుసుకోండి..?

ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉన్నప్పుడు లేదా ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు అచేతనంగా గోళ్లు కొరకడం చాలా మందిలో చూస్తుంటాం. ఇదొక సాధారణ లోపంగా అనిపించినా.. దీని వెనుక మన భావోద్వేగాలు, అంతర్గత ఆందోళనలు, మెదడు చేసే సైలెంట్ పోరాటం దాగి ఉంటాయని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ అలవాటుకు అసలు కారణాలేంటి..? దీనివల్ల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడతాయి..? దీన్ని ఎలా మానుకోవాలి అనేది తెలుసుకుందాం..

మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా.. మీ మనసు చెప్పే రహస్యం ఏంటో తెలుసుకోండి..?
Why Do People Bite Their Nails

Updated on: Nov 17, 2026 | 3:02 PM

కొంతమంది మాట్లాడుతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు లేదా తీవ్రమైన ఆలోచనల్లో ఉన్నప్పుడు అచేతనంగా గోళ్లు కొరకడం ప్రారంభిస్తారు. మొదటి చూపులో ఇదొక సాధారణ చెడ్డ అలవాటుగా అనిపించినా, దీని వెనుక మన భావోద్వేగాలు, ఒత్తిడి, మానసిక ఆందోళనలు దాగి ఉన్నాయని ప్రముఖ సైకాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. చాలా మంది తాము ఎప్పుడు ఈ అలవాటుకు లోనవుతున్నామో కూడా గ్రహించలేకపోతుంటారు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా విషయం గురించి కలత చెందినప్పుడు లేదా మనస్సులో అనేక ఆలోచనలు సుడిగుండలా తిరుగుతున్నప్పుడు, అచేతనంగా గోళ్లు కొరకడం జరుగుతుంది. కొందరికి ఇది తమను తాము కంట్రోల్ చేసుకోవడానికి ఒక సహజమైన మార్గంగా మారుతుంది. అయితే గోళ్లు కొరికే ప్రతి ఒక్కరికీ మానసిక అనారోగ్యం ఉందని భావించలేం.

విసుగు – ఖాళీ సమయం

ఖాళీగా కూర్చున్నప్పుడు లేదా ప్రత్యేకంగా చేయడానికి ఏమీ లేనప్పుడు మెదడు ఏదో ఒక పని చేయాలని వెతుకుతుంది. ఆ సమయంలో తెలియకుండానే ఈ అలవాటు బయటపడుతుంది. అలాగే ప్రతి పనిని పరిపూర్ణంగా చేయాలనుకునేవారిలో పనులు అనుకున్నట్లు జరగనప్పుడు పెరిగే అశాంతి వల్ల కూడా ఈ ప్రవర్తన కనిపిస్తుంది.

బాల్యం నుంచే మొదలయ్యే అవకాశం

చాలా మందిలో ఈ అలవాటు చిన్నతనంలో చదువు ఒత్తిడి, భయం లేదా ఇతరులను చూసి అనుకరించడం ద్వారా మొదలవుతుంది. చిన్నప్పుడే దీనిని సరిదిద్దకపోతే, పెద్దయ్యాక కూడా ఇది అలాగే కొనసాగుతుంది.

ఆరోగ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

పదేపదే గోళ్లు కొరకడం వల్ల గోళ్లు దెబ్బతినడమే కాకుండా వేళ్లకు తీవ్రమైన హాని కలుగుతుంది. చేతుల్లో ఉండే సూక్ష్మ క్రిములు నోటిలోకి వెళ్లడం ద్వారా ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా, ఇది దంతాలు మరియు చిగుళ్ల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావాన్ని చూపుతుంది.

ఈ అలవాటును ఎలా మానుకోవాలి?

కొద్దిపాటి అవగాహన, ఆత్మనిగ్రహంతో ఈ అలవాటును సులభంగా తగ్గించుకోవచ్చు.

  • మీరు ఎక్కువగా ఏయే సమయాల్లో గోళ్లు కొరుకుతున్నారో ముందుగా గుర్తించండి.
  • ఒత్తిడి అనిపించినప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, నడకకు వెళ్లడం లేదా మీకు ఇష్టమైన పనులపై దృష్టి పెట్టండి.
  • మీ గోళ్లను ఎప్పుడూ పొట్టిగా, శుభ్రంగా కట్ చేసుకుని ఉంచుకోండి.
  • స్ట్రెస్ బాల్‌ను పిండడం లేదా చేతిలో పెన్ను పట్టుకోవడం లాంటి ప్రత్యామ్నాయాలతో మీ చేతులను బిజీగా ఉంచండి.

ప్రతి మనిషి ఆలోచనా ధోరణి భిన్నంగా ఉంటుంది. కాబట్టి కేవలం ఈ ఒక్క ప్రవర్తనను బట్టి ఎదుటివారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం లేదా వారిని మానసికంగా బలహీనులుగా భావించడం పొరపాటు. ఒకవేళ ఈ అలవాటు మితిమీరిపోయి మీ దైనందిన జీవితానికి ఆటంకం కలిగిస్తుంటే మాత్రం, నిపుణులైన మానసిక వైద్యులను సంప్రదించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us