కెమికల్స్ వద్దు.. ఆయుర్వేదమే ముద్దంటున్న నటి.. రివీల్ చేసిన వెల్‌నెస్ సీక్రెట్స్

గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కృత్రిమ అందాల కోసం కాకుండా, సహజ సిద్ధమైన జీవనశైలి వైపు అడుగులు వేయడం అందరికీ సాధ్యం కాదు. 'బడే అచ్చే లగ్తే హై' సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన నటి చాహత్ ఖన్నా ఇప్పుడు సరిగ్గా అదే పని చేస్తున్నారు. కేవలం బాహ్య సౌందర్యం కంటే లోపలి నుండి ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యమని నమ్ముతున్నారామె. గత కొద్దికాలంగా ఆమె తన జీవనశైలిని పూర్తిగా ఆయుర్వేద పద్ధతుల్లోకి మార్చుకున్నారు.

కెమికల్స్ వద్దు.. ఆయుర్వేదమే ముద్దంటున్న నటి.. రివీల్ చేసిన వెల్‌నెస్ సీక్రెట్స్
Tv Actor Chahatt Khanna.jpg

Updated on: Apr 20, 2026 | 6:15 AM

చాహత్ ఖన్నా కెమికల్స్, ఇంజెక్టబుల్స్ వంటి వాటికి దూరంగా ఉంటూ, ధ్యానం ఇంకా చక్ర హీలింగ్ ద్వారా తన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వెల్‌నెస్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శారీరక బాధలకు మూల కారణం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత చాహత్ ఖన్నాను ఆయుర్వేదం వైపు నడిపించింది. మొదట్లో కేవలం ప్రశ్నలతో మొదలైన ఆమె ప్రయాణం, క్రమంగా ఒక సంపూర్ణ జీవనశైలిగా మారిపోయింది.

చక్ర హీలింగ్..

చాహత్ తన రోజువారీ అలవాట్లలో విప్లవాత్మక మార్పులు చేశారు. సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయడం, మద్యం పూర్తిగా మానేయడం ఆమె దినచర్యలో భాగమయ్యాయి. కేవలం ఆహారమే కాకుండా, మనం వాడే పాత్రలు కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఆమె నమ్ముతారు. అందుకే ప్లాస్టిక్ వంటి వాటిని పక్కన పెట్టి వెండి, రాగి, కాంస్య ఇంకా ఇనుప పాత్రలను వాడటం ప్రారంభించారు. ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీ (తరంగ ధైర్ఘ్యం) ఉంటుందని, అది మన శరీర శక్తితో అనుసంధానమై ఉంటుందని ఆమె వివరిస్తారు. చక్ర హీలింగ్ ద్వారా తన ఎనర్జీ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ నిరంతరం ఉత్సాహంగా ఉండగలుగుతున్నారు.

కృత్రిమ అందానికి దూరంగా..

నేటి కాలంలో నటీనటులు అందం కోసం రకరకాల ఇంజెక్టబుల్స్, కెమికల్ బేస్డ్ బ్యూటీ ట్రీట్‌మెంట్లు తీసుకోవడం సహజం. అయితే చాహత్ మాత్రం వీటిని పూర్తిగా తిరస్కరిస్తున్నారు. తన శరీరంలోకి ఎటువంటి రసాయనాలు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. మందుల నుండి సౌందర్య సాధనాల వరకు అన్నింటిలోనూ ఆయుర్వేదానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. తన శరీరం చెప్పే మాటను వినడం అలవాటు చేసుకున్నానని, ఏది తన శరీరానికి సెట్ అవుతుందో.. ఏది కాదో తన బాడీనే తనకు చెబుతుందని ఆమె పేర్కొన్నారు.

ఈ మార్పులు కేవలం పైపైన కాకుండా, తన ఆలోచనా ధోరణిని ఇంకా మానసిక స్థితిని సమూలంగా మార్చేశాయని చాహత్ సంతోషం వ్యక్తం చేశారు. సంపూర్ణ ఆరోగ్యం అనేది ఏదో బలవంతంగా చేసే పని కాదు, అది మన మూలాల్లోకి మనం తిరిగి వెళ్లడం అని చాహత్ ఖన్నా మాటలు నిరూపిస్తున్నాయి. సహజ సిద్ధమైన పద్ధతులతో కూడా అద్భుతమైన ఆరోగ్యాన్ని, అందాన్ని సొంతం చేసుకోవచ్చని ఆమె నిరూపిస్తున్నారు.

Follow Us