
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ములుగు జిల్లా ఒక పర్యాటక స్వర్గంలా కనిపిస్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నుండి, మనసును దోచుకునే లక్నవరం సరస్సు వరకు ఇక్కడ ఎన్నో విశేషాలు ఉన్నాయి. వనదేవతలను కొలిచిన తర్వాత, పిల్లలతో కలిసి ఏటూరు నాగారం అభయారణ్యంలో జంతువులను చూడటం లేదా బొగత జలపాతం వద్ద సేద తీరడం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మరి ఈ జాతర సీజన్‌లో మీరు విధిగా చూడాల్సిన ఆ పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చూడదగ్గ ప్రధాన ప్రదేశాలు:
లక్నవరం సరస్సు : మేడారం నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయుల కాలం నాటి ఈ సరస్సులో ‘వేలాడే వంతెన’ ప్రధాన ఆకర్షణ. ఇక్కడ బోటింగ్ క్యాంపింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి.
రామప్ప ఆలయం : యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయం మేడారం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి అద్భుత శిల్పకళ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.
బొగత జలపాతం : ‘తెలంగాణ నయాగరా’గా పిలిచే ఈ జలపాతం మేడారానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని అడవుల మధ్య కొండలపై నుంచి నీరు జాలువారే దృశ్యం అద్భుతంగా ఉంటుంది.
ఏటూరు నాగారం అభయారణ్యం: వన్యప్రాణుల ప్రేమికులకు ఇది సరైన చోటు. మేడారం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో పులులు, చిరుతలు, నెమలిలను చూడవచ్చు.
ఆదివాసీ మ్యూజియం, బయ్యక్కపేట: గిరిజన సంస్కృతిని తెలుసుకోవడానికి రెడ్డిగూడెంలోని మ్యూజియం, అలాగే సమ్మక్క జన్మస్థలమైన బయ్యక్కపేటను తప్పక దర్శించాలి.