
ఆరోగ్య స్పృహ ఉన్నవారు ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన వంటకాలను చేసుకుని తింటారు.. ముఖ్యంగా.. ఫాస్ట్ ఫుడ్ లైఫ్‌స్టైల్‌లో సంప్రాదాయ, పురాతన వంటకాల మేలును చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి మేలు చేసే ఆకుకూరల్లో పొన్నగంటి ఆకు ఒకటి.. పొన్నగంటి ఆకులో విటమిన్లు ఎ, బి, సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం.. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి.. శరీరానికి శక్తిని ఇవ్వడానికి చాలా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా.. కళ్లకు ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి పొన్నగంటి ఆకు కూరను ఇగురు కూరగా, ఫ్రైగా, పప్పులో వేసి రకరకాలుగా వాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..
కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొన్నగంటి ఆకుతో రుచికరమైన రోటి పచ్చడి విధానం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. సాధారణంగా రోటి పచ్చడి అంటే రోట్లో నూరడమే అనుకుంటాము. అయితే, నేటి తరం వారి సౌలభ్యం కోసం, ఈ పచ్చడిని మిక్సీలో కూడా తయారు చేసుకోవచ్చు..
ఈ పచ్చడి తయారీకి ముందుగా ఒక కట్ట పొన్నగంటి ఆకును శుభ్రంగా కడిగి, సన్న కాడలతో సహా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కాడలు పచ్చడికి మరింత రుచిని ఇస్తాయని తెలిపారు. ఆకులో నీళ్ళు పూర్తిగా వడిచిపోయేలా చూసుకోవాలి.
తరువాత, పచ్చడికి కావాల్సిన పప్పులు, మసాలా దినుసులను సిద్ధం చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలో మూడు స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపగుళ్ళను తీసుకోవాలి. పొట్టు మినపప్పు అందుబాటులో ఉంటే దానిని కూడా వాడుకోవచ్చు. వీటిని సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. ఒక నిమిషం తర్వాత అర స్పూన్ జీలకర్ర, ఐదు ఎండుమిర్చి వేసి, అన్నీ కలిపి దోరగా వేయించి వేరే బౌల్‌లోకి తీసుకోవాలి.
అదే బాండీలో ఒక స్పూన్ నూనె వేసి, ఏడెనిమిది పచ్చిమిర్చి, ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఆ తరువాత శుభ్రం చేసి పెట్టుకున్న పొన్నగంటి ఆకును వేసి సన్నని మంటపై వేయించుకోవాలి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆకులోని తడి పూర్తిగా పోయేవరకు వేయించడం ముఖ్యం. ఆకును అడుగు అంటకుండా, మాడిపోకుండా జాగ్రత్తగా కదుపుతూ పచ్చి వాసన పోయేవరకు వేయించి, స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
వేయించి చల్లార్చిన పప్పులు, మసాలా దినుసులను ముందుగా మిక్సీలో వేసి కాస్త మెత్తగా పట్టుకోవాలి. తరువాత, వేయించి చల్లార్చిన పొన్నగంటి ఆకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిని మిక్సీలోకి మార్చుకోవాలి. తగినంత ఉప్పు, పది నిమిషాల ముందు నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజు చింతపండును వేయాలి. చింతపండు నానబెట్టిన నీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత, చింతపండు నానబెట్టిన నీటిని కలిపి మరొక్కసారి మిక్సీ పట్టుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి ఒక పల్స్ ఇస్తే పచ్చడి తయారవుతుంది.
పచ్చడికి తాలింపు పెట్టుకోవడం కూడా కీలకమే. ఒక బాండీలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి ముక్కలు, పావు టీ స్పూన్ మెంతిపిండి, పావు టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేయాలి. స్టవ్ ఆపి, కొంచెం కరివేపాకు వేసి, తాలింపు చిటపటలాడే వరకు వేగనివ్వాలి. వేగిన తాలింపులో సిద్ధం చేసుకున్న పచ్చడిని వేసి, ఒక నిమిషం పాటు నూనెలో మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి వారం రోజుల వరకు చెడిపోకుండా నిల్వ ఉంటుంది.
నూనెను పచ్చడి పీల్చుకున్న తర్వాత స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్‌లోకి మార్చుకోవాలి. ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన పొన్నగంటి ఆకు పచ్చడిని దోశ, ఇడ్లీ, చపాతీ, అన్నం వంటి వాటిలోకి ఆస్వాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. కళ్ళ ఆరోగ్యానికి మంచిదైన ఈ పచ్చడిని ఇంట్లో సులభంగా తయారు చేసుకుని ఆస్వాదించండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..