మహిళల థైరాయిడ్ సమస్యలకు చెక్.. వీటిని ముట్టుకోకపోతే చాలు.. పక్కా డైట్ ప్లాన్ ఇదీ..

పెరుగుతున్న బరువు.. విపరీతంగా రాలిపోతున్న జుట్టు.. ఎంత విశ్రాంతి తీసుకున్నా వదలని అలసట.. ఈ లక్షణాలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే దానికి కారణం థైరాయిడ్ కావచ్చు. మగవారితో పోలిస్తే మహిళల్లో ఈ థైరాయిడ్ హార్మోన్ల సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే చిన్న చిన్న మార్పులతో ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

మహిళల థైరాయిడ్ సమస్యలకు చెక్.. వీటిని ముట్టుకోకపోతే చాలు.. పక్కా డైట్ ప్లాన్ ఇదీ..
Thyroid Diet For Women
Image Credit source: Getty Images

Updated on: Jul 04, 2026 | 2:12 PM

మగవారితో పోలిస్తే మహిళల్లో థైరాయిడ్ హార్మోన్ల అసాధారణతలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు.. ఊబకాయం, క్రమరహిత రుతుస్రావం, తీవ్రమైన అలసట, విపరీతంగా జుట్టు రాలడం వంటి లక్షణాలు వేధిస్తుంటాయి. అయితే సరైన జీవనశైలి, ఆహార నియమాలు పాటించడం ద్వారా ఈ తీవ్రమైన థైరాయిడ్ సమస్యల నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ బారిన పడిన మహిళలు తమ రోజువారి ఆహారంలో ఏవి చేర్చుకోవాలి, వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

థైరాయిడ్ ఉన్నవారు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలు..

థైరాయిడ్ గ్రంథి సజావుగా పనిచేయడానికి సెలీనియం, జింక్, అయోడిన్ వంటి పోషకాలు అత్యంత అవసరం. ఇందుకోసం క్రింది ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోవాలి.

గుడ్లు: గుడ్డు సొనలో అయోడిన్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి బాగా సహాయపడతాయి.

సముద్రపు చేపలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే సార్డిన్లు, మాకెరెల్ వంటి చేపలను తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే వాపులు తగ్గుతాయి.

గింజలు: బాదం, వాల్‌నట్‌లు, గుమ్మడికాయ గింజలలో జింక్ అద్భుతమైన మూలాధారంగా లభిస్తుంది.

ఆకుకూరలు, యాంటీఆక్సిడెంట్ పండ్లు: ఉసిరికాయలు, ఆపిల్ పండ్లు మరియు చిక్కుడు జాతి గింజల వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

పాల ఉత్పత్తులు: థైరాయిడ్ ఉన్నవారిలో కాల్షియం లోపం ఏర్పడే ప్రమాదం ఎక్కువ. అందుకే ప్రతిరోజూ పాలు, పెరుగు తీసుకోవడం మంచిది.

పొరపాటున కూడా తినకూడని ఆహారాలు:

ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, కొన్ని రకాల ఆహార పదార్థాలు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని దెబ్బతీస్తాయి. అలాంటి వాటికి దూరంగా ఉండాలి.

సోయా ఉత్పత్తులు: సోయా గింజలు, సోయా పాలు, మిల్ మేకర్ వంటి పదార్థాలు మనం వేసుకునే థైరాయిడ్ మాత్రల శోషణకు ఆటంకం కలిగిస్తాయి.

కొన్ని రకాల కూరగాయలు: క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీలను పచ్చిగా అస్సలు తినకూడదు. వీటిలోని గోయిట్రోజెన్‌లు థైరాయిడ్‌ను పెంచుతాయి. ఒకవేళ తినాలనుకుంటే బాగా ఉడికించిన తర్వాతే తినాలి.

చక్కెర, మైదా పిండి: మిఠాయిలు, బేకరీ ప్రొడక్ట్స్,  ఫాస్ట్ ఫుడ్స్ వల్ల బరువు విపరీతంగా పెరిగి థైరాయిడ్ సమస్య మరింత తీవ్రమవుతుంది.

కెఫీన్: కాఫీ, టీలను ఎక్కువగా తాగడం వల్ల థైరాయిడ్ మందుల పనితీరు, ప్రభావం క్రమంగా తగ్గుతుంది.

ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్యాక్ చేసిన చిప్స్, నిల్వ ఉంచిన ప్రాసెస్ చేసిన మాంసాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

థైరాయిడ్ రోగులు తప్పక పాటించాల్సిన 4 ముఖ్యమైన నియమాలు.

మందులు వేసుకునే విధానం: డాక్టర్ సూచించిన థైరాయిడ్ మాత్రను ఉదయం పూట ఖాళీ కడుపుతో మాత్రమే వేసుకోవాలి. మాత్ర వేసుకున్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు టీ, కాఫీలతో సహా ఏమీ తినకూడదు, తాగకూడదు.

సొంత వైద్యం వద్దు: థైరాయిడ్ లక్షణాలు కనిపించగానే మెడికల్ షాపులకు వెళ్లి సొంతంగా మందులు వాడటం ప్రాణాలకే ప్రమాదం.

రోజువారీ వ్యాయామం: థైరాయిడ్ వల్ల శరీర మెటబాలిజం నెమ్మదిస్తుంది. దీనిని నివారించడానికి రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ లేదా తేలికపాటి
వ్యాయామాలు చేయాలి.

రెగ్యులర్ బ్లడ్ టెస్ట్: డాక్టర్ సలహా మేరకు క్రమం తప్పకుండా రక్తాన్ని పరీక్షించుకుంటూ, హార్మోన్ లెవెల్స్ బట్టి మందుల డోసేజ్‌ను అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి.

Follow Us