
అధికంగా చెమట పట్టడం అనేది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే సహజమైన ప్రక్రియ అయినప్పటికీ, కొన్నిసార్లు ఇది ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. సాధారణంగా వ్యాయామం చేసినప్పుడు లేదా వేసవిలో చెమట పట్టడం ద్వారా శరీరం చల్లబడుతుంది. వ్యర్థాలు బయటకు పోతాయి. అయితే, ఎటువంటి శ్రమ లేకపోయినా విపరీతంగా చెమట పట్టడాన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఇది శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్ల కొరతకు దారితీస్తుంది. అంతేకాకుండా చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. గుండెదడ లేదా ఆందోళనతో కూడిన చెమటలు పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
చెమట పట్టడం వల్ల శరీరంలోని అధిక వేడి బయటకు వెళ్లి, అంతర్గత ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. చెమట రూపంలో శరీరంలోని కొన్ని రకాల విషపదార్థాలు, వ్యర్థాలు బయటకు పంపబడతాయి. చెమట పట్టినప్పుడు చర్మ రంధ్రాలు తెరుచుకుని, వాటిలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి తొలగిపోతాయి.
చెమట పట్టడం మంచిదే అయినప్పటికీ, పరిమితికి మించి పట్టడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అధిక చెమట కారణంగా శరీరంలో నుండి నీటితో పాటు సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు అధికంగా బయటకు వెళ్లిపోవడం వల్ల తీవ్ర నీరసం, అలసట, కళ్లు తిరగడం వంటివి సంభవిస్తాయి.
చల్లని వాతావరణంలో ఉన్నా లేదా ఎటువంటి వ్యాయామం చేయకపోయినా అరచేతులు, అరికాళ్లు, ముఖంపై విపరీతంగా చెమట పట్టడాన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఇది ఒక వైద్యపరమైన సమస్య. శరీరం ఎల్లప్పుడూ తేమగా ఉండటం వల్ల చంకలు, తొడల భాగాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ర్యాషెస్, దురద, చెడు వాసన వస్తాయి.
అధికంగా చెమట పట్టడంతో పాటు ఈ క్రింది లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు:
హఠాత్తుగా విపరీతంగా చెమటలు పట్టడం.
చెమటతో పాటు ఛాతీలో నొప్పి, గుండెదడ, ఆందోళన లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటం.
రాత్రి వేళల్లో నిద్రపోతున్నప్పుడు విపరీతంగా చెమటలు పట్టడం. సాధారణ చెమట శరీరానికి మేలు చేసినప్పటికీ, విపరీతమైన చెమట పడితే శరీరంలో ద్రవాల శాతాన్ని పెంచడానికి నిమ్మరసం, కొబ్బరిబోండాలు, నీరు ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..