
ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం మాత్రమే కాదు.. దాని వెనుక ఎన్నో వేల ఏళ్ల చరిత్ర, మరెన్నో ఆసక్తికరమైన సైన్స్ రహస్యాలు దాగి ఉంటాయి. మనం రోజూ ఇష్టంగా తినే సమోసా, క్యారెట్, చాక్లెట్ వెనుక ఉన్న నిజాలు తెలిస్తే ‘అవునా.. నిజమా?’ అని ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటి 10 ఆసక్తికరమైన ఫుడ్ ఫ్యాక్ట్స్ మీకోసం..
ప్రపంచంలో ఎక్స్పైరీ డేట్ లేని ఏకైక సహజ ఆహారం తేనె. ఇందులో తేమ చాలా తక్కువగా, ఆమ్లత్వం ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశమే ఉండదు. ఈజిప్టులోని 3,000 ఏళ్ల నాటి పిరమిడ్లలో దొరికిన తేనె పాత్రలను పరీక్షించినప్పుడు, ఆ తేనె ఇప్పటికీ తినడానికి పూర్తిగా పనికొస్తుందని తేలింది.
సాయంత్రం వేళ వేడివేడి టీతో సమోసా తింటే ఆ మజాయే వేరు. ఇది అచ్చమైన భారతీయ స్నాక్ అని చాలామంది అనుకుంటారు. కానీ సమోసా పుట్టింది మధ్యప్రాచ్యం లో! 13, 14 శతాబ్దాల్లో అక్కడి నుంచి వచ్చిన వ్యాపారులు దీనిని మన దేశానికి పరిచయం చేశారు. అక్కడ దీనిని ‘సంబోసా’ అని పిలిచేవారు.
క్యారెట్ అనగానే మనకు నారింజ రంగే గుర్తొస్తుంది. కానీ 17వ శతాబ్దం వరకు క్యారెట్లు ఎక్కువగా ఊదా (పర్పుల్), పసుపు, తెలుపు రంగుల్లోనే ఉండేవి. డచ్ రైతులు తమ దేశపు రాజకుటుంబానికి (హౌస్ ఆఫ్ ఆరెంజ్) గౌరవసూచకంగా క్రాస్-బ్రీడింగ్ చేసి నారింజ రంగు క్యారెట్లను సృష్టించారట. అప్పటి నుంచి అవే ప్రపంచమంతా పాపులర్ అయ్యాయి.
ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి చాక్లెట్ కొంటాం. కానీ పురాతన మయన్, అజ్టెక్ నాగరికతల కాలంలో కోకో గింజలనే డబ్బులా వాడేవారు! పన్నులు కట్టడానికి, మార్కెట్లో కూరగాయలు, ఇతర వస్తువులు కొనడానికి కోకో గింజలను చెల్లించేవారట.
వినడానికి భలే విచిత్రంగా ఉన్నా, వృక్షశాస్త్రం ప్రకారం అరటిపండు, పుచ్చకాయ, టొమాటో వంటివి బెర్రీల జాతికి చెందుతాయి. కానీ పేరులోనే బెర్రీ ఉన్న స్ట్రాబెర్రీ మాత్రం అసలు బెర్రీ కాదట! విత్తనాలు పండు లోపల ఉంటేనే వాటిని బెర్రీలు అంటారు. స్ట్రాబెర్రీకి విత్తనాలు బయట ఉంటాయి కదా!
మనం రోజూ వాడే శాలరీ అనే ఇంగ్లిష్ పదం ఉప్పు నుంచే పుట్టింది! పురాతన రోమ్‌లో సైనికులకు జీతంగా ఉప్పును ఇచ్చేవారు. లాటిన్ భాషలో ఉప్పును సాల్ అంటారు. ఉప్పు కొనుగోలు కోసం ఇచ్చే భత్యాన్ని సలేరియం అనేవారు. అదే కాలక్రమేణా శాలరీగా మారింది.
తీపి, పులుపు, ఉప్పు, చేదులాగా కారం కూడా ఒక రుచి అని మనం అనుకుంటాం. కానీ సైన్స్ ప్రకారం కారం అనేది రుచి కాదు! మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం మన నాలుకపై ఉన్న నరాలను తాకినప్పుడు, నోరు కాలిపోతోందన్న సంకేతాన్ని మెదడుకు పంపుతుంది. అంటే మనం ఆస్వాదించేది రుచిని కాదు, ఓ రకమైన మంటను!
ఒక బకెట్ నీటిలో యాపిల్ పండును వేసి చూడండి.. అది అడుగుకు వెళ్లకుండా పైనే తేలుతుంది. దీనికి కారణం యాపిల్ పండులో దాదాపు 25 శాతం గాలి నిండి ఉండటమే. అందుకే అది నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉండి సులభంగా తేలుతుంది.
ఇంగ్లిష్‌లో పీనట్ అని పిలిచినా, వేరుశనగ నిజానికి బాదం, జీడిపప్పు లాంటి నట్స్ జాతికి చెందదు. ఇది బఠానీలు, చిక్కుళ్ల మాదిరిగా లెగ్యూమ్ (పప్పుధాన్యాల) జాతికి చెందినది. నట్స్ చెట్లకు కాస్తాయి. కానీ వేరుశనగ భూమి లోపల పెరుగుతుంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమపువ్వు. దీని ధర బంగారంతో పోటీ పడుతుంది. ఎందుకంటే కేవలం ఒక కిలో కుంకుమపువ్వును సేకరించడానికి దాదాపు లక్షన్నర పూల నుంచి చేత్తో ఆ రేకులను వేరు చేయాల్సి ఉంటుంది. ఆ శ్రమ వల్లే దీనికి అంత డిమాండ్!