
మన పూర్వీకులు నేల మీద కూర్చుని, పద్మాసనంలో లేదా మడతపెట్టిన కాళ్లతో భోజనం చేసేవారు. కాలక్రమేణా మారుతున్న జీవనశైలి కారణంగా నేడు డైనింగ్ టేబుల్ సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. కుర్చీల్లో కూర్చుని తినడం సౌకర్యంగా అనిపించినప్పటికీ, ఇది మన ఆరోగ్యానికి అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతోంది. అయితే, కింద కూర్చుని భోజనం చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద, ఆధునిక ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మనం కింద కూర్చుని భోజనం చేసేటప్పుడు మన శరీరం ఆటోమేటిక్‌గా యోగా భంగిమలో ఉంటుంది. ఈ భంగిమలో కూర్చున్నప్పుడు మెదడుకు, జీర్ణవ్యవస్థకు మధ్య ఉన్న నరాల వ్యవస్థ ప్రశాంతంగా పనిచేస్తుంది. కడుపులోని అవయవాలకు రక్త ప్రసరణ మెరుగై, మనం తిన్న ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుంది. ఇది గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
నేల మీద కూర్చుని తినడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లకు రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. కానీ, కింద కూర్చున్నప్పుడు గుండెకు రక్త సరఫరా సమతుల్యంగా ఉంటుంది. ఇది గుండెపై అదనపు భారాన్ని తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
నేడు చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. కింద కూర్చుని భోజనం చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మనం కింద కూర్చుని లేచేటప్పుడు పొట్ట కండరాలపై ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా, ఇలా తింటున్నప్పుడు మనం ఎంత తింటున్నాము అనే దానిపై మెదడుకు సంకేతాలు త్వరగా అందుతాయి. దీనివల్ల కడుపు నిండిన భావన కలిగి, అతిగా తినడాన్ని నివారించవచ్చు. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా బరువు అదుపులో ఉంటుంది.
పురాతన కాలం నాటి మన సంప్రదాయాల వెనుక ఎంతో బలమైన శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. రుచిగా తినడమే కాకుండా, ఆరోగ్యంగా జీవించడానికి కింద కూర్చుని భోజనం చేసే అలవాటును మళ్లీ మన దినచర్యలో చేర్చుకోవడం ఎంతో శ్రేయస్కరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..