
పెళ్లంటేనే సందడి.. ఇంటినిండా బంధువులు.. పందిరి.. పసుపు.. పెళ్లి పనులు.. అక్షింతలు.. ఆశీర్వాదాలు..! ముఖ్యంగా మన తెలుగు ఇళ్లల్లో పెళ్లి అంటే కనీసం నెల రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం కనిపిస్తుంది. బంధువుల రాకపోకలు.. పెళ్లి పనులతో ఇల్లంతా సందడిగా మారుతుంది. కానీ ఇప్పుడు కాలం మారింది. గతంలో పెళ్లింటికి వెళ్లి అక్షింతలు వేయడం.. వధూవరులను ఆశీర్వదించడం ఒక సంప్రదాయం. ఇప్పుడు అదే సంప్రదాయం డిజిటల్ రూపం దాల్చింది. 5G యుగంలో పెళ్లి సందడి కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది.
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపల సింగారంకు చెందిన జయరాజు, జ్యోతి దంపతులకు హిమబిందు ఏకైక కుమార్తె. అల్లారుముద్దుగా పెంచిన హిమబిందును ఉన్నత విద్యను చదివించారు. అమెరికాలో హిమబిందు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. ఇదే క్రమంలో ఏపీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే పెళ్లిని భారతదేశంలో బంధువుల సమక్షంలో ఘనంగా చేసుకోవాలని అనుకున్నారు. కానీ వీసా ఇతర కారణాలతో తమ పెళ్లిని అమెరికాలోనే జరుపుకోవాలని హిమబిందు, రోహిత్ కుమార్ భావించారు. హిమబిందు తల్లిదండ్రులు జయరాజు, జ్యోతి తమ కుమార్తె పెళ్లికి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయారు. అయినా అందివచ్చిన ఆధునిక టెక్నాలజీ సహాయంతో వధూవరులను ఆశీర్వదించే ఏర్పాట్లు చేసుకున్నారు. అమెరికాలో కూతురు హిమబిందు పెళ్లి జరుగుతున్నా.. జ్యోతి జయరాజ్ దంపతులు మాత్రం.. వేపల సింగారంలో తమ ఇంట్లో బంధువులతో పెళ్లి సందడి చేశారు.
సంప్రదాయం మారలేదు.. పద్ధతి మాత్రమే మారింది..
అమెరికాకు వెళ్లకుండానే ఆన్ లైన్ ద్వారా వివాహ వేడుకను వీక్షించారు. పెళ్లిలో సంప్రదాయ ఆచారం నిర్వహించే సమయం రాగానే.. జయరాజు, జ్యోతి చేతుల్లో అక్షింతలు తీసుకున్నారు. స్క్రీన్ పై కనిపిస్తున్న తమ కుమార్తె హిమబిందు, అల్లుడు రోహిత్ కుమార్ పై అక్షింతలను చల్లి ఆశీర్వదించారు. కుమార్తె, అల్లుడు వివాహ ప్రమాణాలు చేసుకుంటున్న సమయంలో ఈ విధంగా తల్లిదండ్రులు తమ ఆశీర్వాదాలను అందించారు. హిమబిందుకు, తల్లిదండ్రులు ప్రత్యక్షంగా పెళ్లికి హాజరు కాలేకపోయినా.. వీడియో కాల్ తో జయరాజు, జ్యోతిలకు కూడా తమ కుమార్తె పెళ్లిలో తల్లిదండ్రులుగా చేయాల్సిన సంప్రదాయాన్ని పూర్తిగా మిస్ కాకుండా నిర్వహించారు. పెళ్లి అమెరికాలో జరిగినా.. జయరాజు జ్యోతి దంపతులు మాత్రం తమ ఇంటి వద్దే బంధువుల సమక్షంలో పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పెళ్లి పందిరి అమెరికాలో.. అక్షింతలు మాత్రం ఇంటి నుంచే పడ్డాయి. వధూవరులు వేల మైళ్ల దూరంలో ఉన్నా.. ఆశీర్వాదాలకు మాత్రం దూరం లేదని నిరూపించింది టెక్నాలజీ. కాలం మారింది.. పెళ్లి తీరు మారింది. .కానీ మన సంప్రదాయాలు మాత్రం మారలేదు. అయితే ఇది కేవలం టెక్నాలజీ వినియోగం మాత్రమే కాదు.. విదేశాల్లో స్థిరపడిన కుటుంబాలకు, స్వదేశంలో ఉన్న పెద్దలకు మధ్య అనుబంధాన్ని కొనసాగించే ఓ కొత్త మార్గం.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..