
జొన్న జావ అనేది సంప్రదాయకంగా మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది కేవలం రుచికరమైనదే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన అద్భుతమైన వంటకం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఈ జొన్న జావ ఒక ఆదర్శవంతమైన అల్పాహారం లేదా రాత్రి భోజనం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎన్నో పోషకాలు కలిగిన జొన్నలతో ఆహారం తయారు చేసుకోవడంతోపాటు.. జావను కూడా సిద్ధం చేసుకోవచ్చు.. వాస్తవానికి జొన్నలలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. పీచు (ఫైబర్), ప్రొటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, బి విటమిన్లు (నియాసిన్) పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అంతేకాకుండా.. బరువు తగ్గేందుకు, డయాబెటిస్ నియంత్రణకు సహాయపడతాయి.. అయితే.. జొన్న జావ తయారీ సమయంలో కొన్ని టిప్స్ పాటిస్తే.. సులభంగా తయారవ్వడంతోపాటు.. అద్భుతంగా మారుతుంది. ముఖ్యంగా అన్నం బదులు దీన్ని తింటే.. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..
ముందుగా, ముప్పావు కప్పు జొన్న రవ్వను, పావు కప్పు పచ్చి శనగపప్పును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పచ్చి శనగపప్పు వద్దనుకునే వారు మొత్తం ఒక కప్పు జొన్న రవ్వను ఉపయోగించవచ్చు. వీటిని కుక్కర్‌లో వేసి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి, కనీసం ఒక గంట పాటు నానబెట్టాలి. ఒక గంట నానిన తర్వాత, మీడియం ఫ్లేమ్‌లో ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. రవ్వ చక్కగా మెత్తగా ఉడకాలి. ఒకవేళ సరిగా ఉడకకపోతే, కొద్దిగా నీళ్లు చేర్చి మళ్ళీ ఉడికించుకోవచ్చు.
మరొక పక్కన, ఒక పాన్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ నూనె లేదా వెన్న వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి కొద్దిగా వేయించాలి. వెల్లుల్లి కొద్దిగా రంగు మారగానే, ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఉల్లిపాయ మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం పారదర్శకంగా మారితే సరిపోతుంది.
ఇప్పుడు వేగిన ఉల్లిపాయ మిశ్రమంలో పావు కప్పు క్యారెట్ ముక్కలు, పావు కప్పు పచ్చి బఠాణీ వేయాలి. మీకు నచ్చిన ఇతర కూరగాయలను కూడా చేర్చుకోవచ్చు. ఈ కూరగాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసి కలిపి, మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. కూరగాయలు పూర్తిగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చిదనం తగ్గితే సరిపోతుంది.
కూరగాయలు ఉడికిన తర్వాత, అందులో ఒక టీ స్పూన్ మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. కారం బదులు మిరియాల పొడిని ఉపయోగిస్తారు కాబట్టి, రుచికి తగ్గట్టుగా మిరియాల పొడిని సర్దుబాటు చేసుకోవచ్చు. కావాలంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా కలుపుకోవచ్చు.
ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న జొన్న రవ్వ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం చిక్కగా ఉంటే, తగినన్ని నీళ్లు పోసి పల్చగా జావ కన్సిస్టెన్సీకి తీసుకురావాలి. సాధారణంగా రెండు కప్పుల నీళ్లు సరిపోతాయి, కానీ మీకు ఇంకా చిక్కగా కావాలంటే నీళ్లు తగ్గించుకోవచ్చు. ఈ జొన్న జావ మిశ్రమాన్ని వేయించిన కూరగాయలలో వేసి, ఫ్లేమ్‌ను లోలో పెట్టి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి.
అంతా బాగా కలిసిన తర్వాత, రుచి చూసి ఉప్పు లేదా మిరియాల పొడి తగ్గితే చేర్చుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించాలి. ఇలా చేయడం వల్ల కూరగాయల రుచులు జావకు బాగా పట్టి, మరింత రుచికరంగా మారుతుంది. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
ఈ ఆరోగ్యకరమైన, రుచికరమైన జొన్న జావ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా చల్లటి వాతావరణంలో కొంచెం ఎక్కువ మిరియాల పొడి వేసి ఘాటుగా తీసుకుంటే చాలా హాయిగా ఉంటుంది. ఇది ఉదయం అల్పాహారంగా లేదా రాత్రి తేలికపాటి భోజనంగా తీసుకోవడానికి చాలా అనుకూలం. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. పిల్లల కోసం వడ్డించేటప్పుడు, పైన అర టీ స్పూన్ నెయ్యి కలిపి ఇవ్వడం వల్ల మంచి రుచి వస్తుంది. నెయ్యి కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇంకెందుకు ఆలస్యం.. ఈ సులభమైన, ఆరోగ్యకరమైన రెసిపీని ప్రయత్నించి ఆస్వాదించండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..