గజ్జి, తామరను పోగొట్టి లివర్, కిడ్నీలను క్లీన్ చేస్తుంది.. ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధం ఈ మొక్క..

నేల ఉసిరి లేదా ఫైలాంథస్‌ అమరస్‌ భారతీయ సంప్రదాయ వైద్యంలో ఉపయోగించే ఔషధ మొక్కల్లో ఒకటి.. దీనిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి.. ఇది కాలేయం, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాల ఆరోగ్యానికి సహాయపడుతుందని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. నేల ఉసిరి ఉపయోగాలేంటో తెలుసుకోండి..

గజ్జి, తామరను పోగొట్టి లివర్, కిడ్నీలను క్లీన్ చేస్తుంది.. ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధం ఈ మొక్క..
Nela Usiri Benefits

Updated on: Oct 07, 2026 | 11:36 AM

ప్రకృతిలో లభించే ప్రతి మొక్క మనిషికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుందనడానికి నేల ఉసిరి ఒక అద్భుత ఉదాహరణ. మన ఇంటి పరిసరాలలో సాధారణంగా కనిపించే ఈ చిన్న మొక్క, అనేక అమూల్యమైన ఔషధ గుణాలతో నిండి ఉంది. దీనిని సాధారణంగా పిచ్చిమొక్కగా పరిగణిస్తారు.. కానీ దీని ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. నేల ఉసిరి శాస్త్రీయ నామం ఫైలాంథస్ అమరస్ (Phyllanthus amarus).. ఇది యూఫోర్బియేసి (Euphorbiaceae) కుటుంబానికి చెందినది. ఇంగ్లీష్‌లో దీనిని “సీడ్-అండర్-లీఫ్” (seed-under-leaf) లేదా “స్టోన్‌బ్రేకర్‌” (stonebreaker) అని పిలుస్తారు.

మొక్క లక్షణాలు:

నేల ఉసిరి సుమారు 60 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు చతురస్త్రాకారంలో ఉండి, ఆకుపచ్చ తెలుపు రంగులో చిన్న పువ్వులు ఆకుల కింద భాగంలో పూస్తాయి. దీని కాండం ఆకుపచ్చగా, మృదువుగా ఉంటుంది. ఆకుల కింద విత్తనాలు ఉండటం దీని ప్రత్యేకత. భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర – తెలంగాణ ప్రాంతాల్లో ఇది విరివిగా లభిస్తుంది. నేల ఉసిరి మొక్కలోని ప్రతి భాగం – కాండం, వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు, పాలు – అన్నీ ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగపడతాయి.

కాలేయ ఆరోగ్యానికి వరం:

నేల ఉసిరి కాలేయ వ్యాధుల నివారణకు, ప్రత్యేకించి హెపటైటిస్ బి వంటి భయంకరమైన సమస్యలకు అత్యంత ప్రసిద్ధి చెందింది. మానవ శరీరంలో కాలేయం డీటాక్సిఫికేషన్ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. నేల ఉసిరి కాలేయాన్ని రక్షించడంలో సహాయపడే పోషక విలువలను కలిగి ఉంది. ఆయుర్వేదం ప్రకారం, నేల ఉసిరి వేరును పాలలో మరిగించి 40 రోజుల పాటు తాగితే కాలేయ వ్యాధులు నయమవుతాయి. కామెర్లు (జాండీస్) సమస్యతో బాధపడేవారు నేల ఉసిరి మొక్కను వేర్లతో సహా తీసుకొని శుభ్రం చేసి, మెత్తగా నూరి తీసిన రసాన్ని పెరుగులో కలుపుకొని ఉదయం, సాయంత్రం తీసుకుంటే రెండు మూడు రోజుల్లో ఉపశమనం లభిస్తుంది.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు:

శ్వాసకోశ సమస్యలు: శ్వాస సంబంధిత రోగాలను శాశ్వతంగా నయం చేయడానికి నేల ఉసిరి రసాన్ని పటికబెల్లం చూర్ణంతో కలిపి తీసుకోవాలని చరక మహర్షి తన గ్రంథాలలో వివరించారు.

చర్మ వ్యాధులు: గజ్జి, తామర వంటి చర్మ సమస్యలతో బాధపడేవారు నేల ఉసిరి ముద్దను ఉప్పుతో కలిపి ప్రభావిత ప్రాంతంలో ఉంచితే తక్షణ ఉపశమనం పొందవచ్చు.

రక్తహీనత (అనీమియా): 10 గ్రాముల నేల ఉసిరి వేర్ల రసాన్ని అర గ్లాసు ఆవుపాలలో కలిపి ఆహారానికి గంట ముందు రెండు పూటలా తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుందంటున్నారు.

మూత్ర సంబంధిత రోగాలు: నేల ఉసిరి ఆకు రసాన్ని ఒక చెంచా మోతాదులో ఒక గ్లాసు నాటు ఆవుపాలతో కలిపి రెండు పూటలా తాగితే మూత్ర రోగాలు నయమవుతాయని చెబుతున్నారు నిపునులు..

ఎక్కిళ్లు, ఆకలి: ఎక్కిళ్లు ఆగడానికి, ఆకలి పెరగడానికి నేల ఉసిరి ఆకులను ఉదయం, సాయంత్రం నమలడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఇది పిల్లలు, పెద్దలు ఇద్దరికీ ఉపయోగపడుతుంది.

ఎముకలు విరిగినప్పుడు: విరిగిన ఎముకలు అతుక్కోవడానికి, నొప్పి, వాపు తగ్గడానికి నేల ఉసిరి మొక్కను వేర్లతో సహా దంచి, విరిగిన ప్రదేశంలో కట్టు కడతారు.

మూత్రపిండాల రాళ్లు: 2014లో జరిపిన ఒక పరిశోధనలో నేల ఉసిరి కిడ్నీలోని రాళ్లను కరిగించే శక్తి ఉందని వెల్లడైంది. దీని కషాయాన్ని తాగడం ద్వారా రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్తాయని పేర్కొంటున్నారు.

జ్వరాలు, దగ్గు: అనేక వైరస్‌ల వలన వచ్చే జ్వరాలకు, దగ్గుకు నేల ఉసిరి ఆకులను నూరి ఉండలుగా చేసి తేనెతో కలిపి తీసుకోవడం ఉపశమనాన్ని ఇస్తుంది.

డీటాక్సిఫికేషన్: నేల ఉసిరిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ దీని ఆకులను కొద్ది మొత్తంలో పరగడుపున తింటే శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

నేల ఉసిరిని సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు..

అయితే, ఏదైనా అనారోగ్య సమస్యలకు ఔషధ మొక్కను ఉపయోగించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us