
వేసవి కాలంలో తీవ్రమైన ఎండల వల్ల పాలు త్వరగా విరిగిపోవడం లేదా పాడైపోవడం సర్వసాధారణం. కానీ, కొన్ని సులభమైన చిట్కాలతో పాలను ఎక్కువసేపు తాజాగా ఉంచవచ్చు. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవిలో కూడా పాలు విరిగిపోకుండా సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు. పాలను ఎక్కువ సమయం తాజాగా ఉంచాలంటే.. ముందుగా చేయాల్సిన పని.. వెంటనే మరిగించడం..చాలా మంది పాలు తెచ్చిన తర్వాత కాసేపు పక్కన పెట్టి, తీరిగ్గా మరిగిస్తుంటారు. కానీ, వేసవిలో పాలు తెచ్చిన వెంటనే స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద మరిగించడం వల్ల అందులోని హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. దీనివల్ల పాలు విరిగిపోయే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.
ఇకపోతే, పాలు మరిగించే పాత్ర పూర్తిగా శుభ్రంగా ఉండాలి. అంతకుముందు వాడిన గిన్నెలను సరిగ్గా కడగకుండా అందులో పాలు పోస్తే, పాత బ్యాక్టీరియా వల్ల పాలు వెంటనే విరిగిపోతాయి. కాబట్టి పాలను ఎల్లప్పుడూ బాగా తోమిన, పొడిగా ఉన్న గిన్నెలోనే పోసి మరిగించాలి. పాలు మరిగిన వెంటనే వేడి వేడిగా ఉన్నప్పుడే ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పాలను గది ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి పాలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రత మారిపోయి, ఫ్రిజ్‌లోని ఇతర వస్తువులతో పాటు పాలు కూడా త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది.
చాలా మంది పాలు లేదా పాల ప్యాకెట్లను ఫ్రిజ్ తలుపు (Door) వైపు ఉన్న షెల్ఫ్‌లలో పెడుతుంటారు. ఇది తప్పుడు పద్ధతి. ఫ్రిజ్ తలుపును పదే పదే తీయడం, వేయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పాలను ఎప్పుడూ ఫ్రిజ్ లోపలి భాగంలో లేదా పై షెల్ఫ్‌లో ఉంచాలి. అక్కడ స్థిరమైన చల్లదనం లభించి పాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు పాలను ఒకటి కంటే ఎక్కువసార్లు (అంటే ఉదయం, సాయంత్రం) మరిగించడం కూడా మంచిది. ఈ చిన్నపాటి వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా వేసవి హీట్‌వేవ్‌లో కూడా పాలు విరిగిపోకుండా సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..