
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా కార్న్ ఫ్లోర్ తీసుకుని, అందులో నీళ్లు పోసి ఎక్కడా గడ్డలు లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం హల్వాకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఒక టీస్పూన్ నిమ్మ రసం తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి ద్రావణాన్ని సిద్ధం చేసుకోవాలి.

అడుగు మందంగా, లోతుగా ఉన్న పాన్ తీసుకొని అందులో సరిపడ నీళ్లు పోసి, 1 కిలో పంచదార వేసి కరిగించుకోవాలి. ఈ కొలత ప్రకారం, కార్న్ ఫ్లోర్ కు నాలుగు రెట్లు పంచదార, మూడు రెట్లు నీళ్లు, కార్న్ ఫ్లోర్ కు సమానంగా నెయ్యి పర్ఫెక్ట్ . పంచదార కరిగి కాస్త తీగపాకంలా వస్తే సరిపోతుంది. లేత తీగ పాకం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.

పంచదార కరిగిన తర్వాత, దానిలో నుండి సగం పాకాన్ని తీపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాకంలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. ముందుగా కలిపి పక్కన ఉంచుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని బాగా కలిపి, పాకంలో నెమ్మదిగా పోస్తూ ఉండాలి. కార్న్ ఫ్లోర్ మిశ్రమం అడుగంటకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పోసిన తర్వాత, తక్కువ నుండి మధ్యస్థ మంటపై కలుపుతూ చిక్కబడనివ్వాలి. ఇది దగ్గర పడడానికి కనీసం 8-10 నిమిషాలు పడుతుంది. ఈ దశలో ఓపిక చాలా అవసరం. సుమారు 12-15 నిమిషాల తర్వాత మిశ్రమం ముద్దగా మారుతుంది. అప్పుడు పక్కన ఉంచిన పాకం నుండి ఒక పెద్ద గరిటెడు పాకం, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి చొప్పున ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ పోస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల హల్వా లోపలి దాకా నెయ్యి చేరి, చూయీ స్వభావం వస్తుంది.

ఈ దశలో, కరిగించుకున్న నిమ్మ రసాన్ని కొద్దికొద్దిగా పోస్తూ ఉండాలి. నిమ్మ రసం చేర్చిన తర్వాత, మంటను మధ్యస్థం నుండి అధికం చేసి నిరంతరం కలుపుతూ ఉండాలి. కలపడం ఆపితే అడుగంటుతుంది. ఈ ప్రక్రియను చివరి వరకు కొనసాగించాలి. సుమారు 30 నిమిషాలకు, కార్న్ ఫ్లోర్ నెయ్యిని పీల్చి, బుడగలు బుడగలుగా తయారవుతుంది. ఈ దశలో పావు కప్పు జీడిపప్పు పలుకులు వేసి బాగా కలపాలి. దాదాపు 40 నిమిషాల తర్వాత, కొద్దిగా హల్వాను చేతిలోకి తీసుకుని బాల్ లాగా ఏర్పడితే అది తయారైనట్లు అర్థం. అలా కాకపోతే మరికొంతసేపు వేయించాలి. ఈ "బాల్ టెస్ట్" హల్వా చూయీగా రావడానికి కీలకమైనది.

హల్వా పర్ఫెక్ట్ గా తయారైన తర్వాత, అర టీస్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వేసి హై ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాలు బాగా కలపాలి. ఇది హల్వాకు ఆకర్షణీయమైన రంగును ఇస్తుంది. ఇప్పుడు ఈ జిగురుగా ఉన్న హల్వాను ఒక మౌల్డ్ లో పోసి, పైన పావు కప్పు జీడిపప్పు పలుకులు చల్లి, కనీసం నాలుగు నుంచి ఐదు గంటల పాటు పూర్తిగా చల్లబడనివ్వాలి. తర్వాత, హల్వా గట్టిపడుతుంది. తర్వాత దానిని కట్ చేసి తినెయ్యాలి అంతే టేస్టీ టేస్టీ కరాచీ హల్వా రెడీ.