
నేటి జీవనశైలిలో గుండె సంబంధిత సమస్యలు పెద్దలకే కాకుండా పిల్లలలో కూడా పెరుగుతున్నాయి. పెద్దలలో గుండె జబ్బుల లక్షణాలు స్పష్టంగా కనిపించవచ్చు. కానీ పిల్లలలో ఇవి చాలా సార్లు నిశ్శబ్దంగా, గుర్తించడానికి కష్టంగా ఉంటాయి. చిన్నపిల్లలు తమ శారీరక అసౌకర్యాలను సరిగా వివరించలేకపోవడం వల్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. సరైన సమయంలో గుర్తించకపోతే, సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఆకలి లేకపోవడం, శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం వంటి సమస్యలను తేలికగా తీసుకోవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి గుండె జబ్బుల హెచ్చరిక కావచ్చని అంటున్నారు. ఇప్పుడు వైద్య నిపుణుల సూచనల గురించి తెలుసుకుందాం.
పిల్లలు ఇతర పిల్లలతో ఆడుకునేటప్పుడు లేదా కొద్దిగా పరిగెత్తినప్పుడే ఎక్కువగా అలసిపోవడం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటం గమనించాల్సిన విషయం. మెట్లు ఎక్కేటప్పుడు కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకండి.
పిల్లలు వయసుకు తగ్గట్టుగా బరువు పెరగకపోవడం, తరచూ ఆహారం పట్ల విరక్తి చూపడం, పాలిచ్చేటప్పుడు త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు గుండె సమస్యల సంకేతాలు కావచ్చు.
సాధారణ వాతావరణంలోనే, ముఖ్యంగా పాలు లాంటి పానీయాలు తాగేటప్పుడు లేదా ఆహారం తినేటప్పుడు ఎక్కువగా చెమటలు పడటం గుండెపై అధిక ఒత్తిడి ఉందనే సూచన కావచ్చు.
ఇతర పిల్లల మాదిరిగా చురుకుగా ఉండాల్సిన వయసులోనే పిల్లలు ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపించడం, ఆడటానికి ఆసక్తి చూపకపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.
ఏడుస్తున్నప్పుడు లేదా నవ్వుతున్నప్పుడు పెదవులు, గోళ్లు కొద్దిగా నీలం రంగులోకి మారడం ఆక్సిజన్ లోపానికి సంకేతం. ఇది గంభీరమైన లక్షణం కావచ్చు.
మీ బిడ్డ ప్రవర్తనలో చిన్న మార్పులనైనా గమనించండి.
తరచూ అలసట, శ్వాసలో ఇబ్బంది, ఆహారం తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
పుట్టుకతో వచ్చే గుండె లోపాలు (Congenital Heart Defects) ముందుగానే గుర్తిస్తే, శస్త్రచికిత్స లేదా మందుల ద్వారా పూర్తిగా నియంత్రించవచ్చు లేదా నయం చేయవచ్చు.
పిల్లల ఆరోగ్యం విషయంలో “ఇది చిన్న విషయం” అని భావించి వదిలేయడం మంచిది కాదు. చిన్న లక్షణమే పెద్ద సమస్యకు ప్రారంభ సూచన కావచ్చు. సరైన సమయంలో జాగ్రత్త పడితే, మీ బిడ్డకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించవచ్చు. తల్లిదండ్రుల అప్రమత్తతే పిల్లల ఆరోగ్య రక్షణకు మొదటి అడుగు అని గుర్తుంచుకోవాలి.