
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి ప్రశాంతత కరువవుతోంది. ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, పెరుగుతున్న ఖర్చులు, స్మార్ట్‌ఫోన్‌లతో ఎక్కువ సమయం గడపడం వంటి కారణాలతో మనసుకు విశ్రాంతి లేకుండా పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవితాన్ని హ్యాపీగా, ప్రశాంతంగా మార్చుకోవడానికి జపనీయుల జీవనశైలి నుంచి కొన్ని మంచి అలవాట్లను నేర్చుకోవచ్చు. జపాన్‌లో రోజువారీ పనులను క్రమశిక్షణతో చేయడం, ఆహారానికి విలువ ఇవ్వడం, వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించడం, ప్రకృతిని ఆస్వాదించడం వంటి అలవాట్లకు ప్రాధాన్యం ఇస్తారు. వీటిని మన జీవితంలోనూ సులభంగా అలవర్చుకుంటే..జీవితం హ్యాపీగా మారిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.
ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైతే రోజంతా పనులను ప్రణాళిక ప్రకారం చేసుకునే అవకాశం ఉంటుంది. జపనీయుల జీవనశైలిలో ఉదయపు సమయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. నిద్రలేవగానే ఫోన్ చూడటం, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం కాకుండా కొంత సమయం మన కోసం కేటాయించుకోవాలి. తేలికపాటి వ్యాయామం, నడక, ధ్యానం లేదా ఆ రోజు చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకోవడం ద్వారా రోజును ఉత్సాహంగా ప్రారంభించవచ్చు. అయితే తగినంత నిద్రకు ప్రాధాన్యం ఇస్తూనే ఉదయాన్నే నిద్రలేవడం ముఖ్యం.
జపనీయుల సంస్కృతిలో పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఇంటిని శుభ్రం చేయడం అంటే కేవలం దుమ్ము తొలగించడం మాత్రమే కాదు.. వస్తువులను క్రమపద్ధతిలో ఉంచడం కూడా. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ఇంటిని సర్దుకోవడానికి కేటాయించండి. అవసరం లేని వస్తువులను తొలగించండి. ఇలా చేయడం వల్ల పరిసరాలు చక్కగా ఉండటంతో పాటు రోజువారీ పనులు సులభంగా చేసుకోవచ్చు.
రోజంతా పని చేసిన తర్వాత శరీరానికి, మనసుకు విశ్రాంతి అవసరం. జపాన్‌లో వెచ్చని నీటితో స్నానం చేయడం లేదా టబ్‌లో కొంతసేపు విశ్రాంతిగా గడపడం ఒక అలవాటు. మనం కూడా స్నానాన్ని హడావుడిగా ముగించే పనిగా కాకుండా, రోజంతా అలసట నుంచి బయటపడేందుకు అనువైన విశ్రాంతి సమయంగా మార్చుకోవాలి. సరైన ఉష్ణోగ్రతలో నీటితో స్నానం చేసి, కొద్దిసేపు ప్రశాంతంగా గడపాలి. అయితే మరీ ఎక్కువ వేడిగా ఉండే నీటితో స్నానం చేయడం మంచిది కాదు.
జపాన్‌లో భోజనం ప్రారంభించే ముందు ‘ఇతాదకిమాసు’ అనే పదాన్ని పలుకుతారు. ఇది ఆహారాన్ని స్వీకరించే ముందు కృతజ్ఞతను వ్యక్తం చేసే సంప్రదాయం. మనం కూడా భోజనం చేసే ముందు ఆ ఆహారాన్ని పండించిన రైతులు, తయారు చేసినవారు, వడ్డించినవారి కృషిని గుర్తు చేసుకోవాలి. టీవీ లేదా మొబైల్ చూస్తూ కాకుండా ఆహారంపై దృష్టి పెట్టి నెమ్మదిగా తినాలి. అవసరమైనంత మాత్రమే వడ్డించుకోవడం ద్వారా ఆహార వృథాను తగ్గించే అవకాశం ఉంటుంది.
ఇంట్లోకి వచ్చిన వెంటనే చెప్పులు, బూట్లను ఎక్కడపడితే అక్కడ వదిలేయకుండా నిర్ణీత ప్రదేశంలో ఉంచడం జపానీయుల్లో కనిపించే ఓ మంచి అలవాటు. ఈ పద్ధతిని మనం కూడా పాటించడం మంచిది. బయట నుంచి వచ్చిన తర్వాత చెప్పులు లేదా షూస్ సరిగ్గా అమర్చాలి. ఇంట్లో ఉపయోగించిన వస్తువులను తిరిగి వాటి స్థానాల్లో పెట్టడం వంటి పనులు ఇంటిని క్రమబద్ధంగా ఉంచుతాయి. ఇలాంటి చిన్న అలవాట్లే క్రమశిక్షణను పెంపొందించడంలో సహాయపడతాయి.
జపాన్‌లో ‘మొత్తైనై’ అనే భావనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అంటే ఉపయోగపడే వస్తువులను వృథా చేయకుండా వాటి విలువను గుర్తించడం. దుస్తులు, ఫర్నిచర్ లేదా ఇతర గృహోపకరణాలు కొద్దిగా పాడైతే వెంటనే పడేయకుండా మరమ్మతు చేయించి మళ్లీ ఉపయోగించవచ్చు. అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండటం కూడా ఇందులో భాగమే. ఈ అలవాటు డబ్బు ఆదా చేయడమే కాకుండా వనరుల వృథాను తగ్గించడంలో సహాయపడుతుంది.
జపనీయుల సంస్కృతిలో ప్రకృతికి, రుతువుల మార్పులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘షున్’ అనే భావన ఒక వస్తువు లేదా ఆహారం దానికి అనువైన కాలంలో లభించినప్పుడు దాన్ని ఆస్వాదించడాన్ని సూచిస్తుంది. మనం కూడా సీజన్‌కు అనుగుణంగా లభించే పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం కొంతసేపు ప్రకృతిలో నడవడం, చెట్లు, పూలు, ఆకాశాన్ని గమనించడం వంటి చిన్న పనులకు సమయం కేటాయించాలి. ఇవి రోజువారీ జీవితంలో ప్రకృతితో అనుబంధాన్ని పెంచుతాయి.