
పండుగలు, శుభకార్యం, ఏదైనా ప్రత్యేక సందర్భంలో తీపి వంటకాలు తప్పనిసరి.. అలాంటప్పుడే కాదు ఎప్పుడైనా వేడిగా, తియ్యగా తినాలనిపిస్తే.. ముందుగా గుర్తొచ్చేది సేమియా పాయసం.. ఇది అప్పటికప్పుడు, తక్కువగా సమయంలో చేసుకోవచ్చు.. ఇష్టంగా తినొచ్చు.. ఇలా సేమియా పాయసం చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని పలు రకాలుగా చేసుకుని తింటారు.. సేమియాను చక్కెర లేదా బెల్లంతో తయారు చేస్తారు. అయితే, చాలా మంది బెల్లంతో సేమియా పాయసం చేసేటప్పుడు పాలు విరిగిపోతాయోమోనని లేదా చల్లారిన తర్వాత చిక్కబడిపోతుందేమోనని ఆందోళన చెందుతారు. ఈ సమస్యలకు పరిష్కారంగా, పాలు విరగకుండా, చిక్కబడకుండా, కమ్మని రుచితో బెల్లం సేమియా పాయసం ఎలా తయారు చేయాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. ఈ రెసిపీ ఆరోగ్యకరమైనది మాత్రమే కాకుండా, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
పాలు లిటర్, సేమియా ఒక కప్పు, నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు, బాదం పప్పు: 2-3 టీ స్పూన్లు (కట్ చేసినవి), జీడిపప్పు: 12-15 (కట్ చేసినవి), నీళ్లు: 2 కప్పులు, బెల్లం పొడి: 1 కప్పు (లేదా తురిమిన బెల్లం), యాలకుల పొడి: అర టీ స్పూన్, పచ్చకర్పూరం: చిటికెడు..
పాలను మరిగించడం: ముందుగా ఒక గిన్నెలో 1 లీటరు పాలు తీసుకుని బాగా మరిగించాలి. పాలను కనీసం మూడు నాలుగు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరిగించడం వల్ల మంచి రుచి వస్తుంది. మరిగించిన పాలను పక్కన పెట్టుకోవాలి.
డ్రైఫ్రూట్స్ వేయించడం: ఇప్పుడు ఒక కడాయిని తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక, కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కావాలంటే ఎండుకొబ్బరి, కిస్‌మిస్‌లు కూడా వేయించుకోవచ్చు.
సేమియా వేయించడం: అదే కడాయిలో ఒక కప్పు సేమియాను వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, కలుపుతూ సేమియా బంగారు రంగులోకి వచ్చేంతవరకు సుమారు మూడు నాలుగు నిమిషాలు వేయించాలి. హై ఫ్లేమ్‌లో వేయిస్తే సేమియా సరిగా వేగదు.
సేమియా ఉడికించడం: సేమియా వేగుతుండగానే, మరో పక్కన ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు తీసుకుని వేడి చేయాలి. సేమియా బంగారు రంగులోకి వచ్చిన తర్వాత, ఈ వేడి నీళ్లను సేమియాలో పోసి బాగా కలపాలి. సేమియా మెత్తగా ఉడికేంతవరకు రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. నీళ్లు దగ్గరపడి సేమియా సాఫ్ట్‌గా మారుతుంది.
బెల్లం కలపడం: సేమియా బాగా ఉడికిన తర్వాతే బెల్లం కలపాలి. ఇందులోకి ఒక కప్పు బెల్లం పొడి (లేదా ముప్పావు కప్పు తురిమిన బెల్లం) వేసి, కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత, పాయసం కాస్త పల్చబడుతుంది. బెల్లం కలిపిన తర్వాత రెండు మూడు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. దీని వలన సేమియా పలుకులకు బెల్లం పాకం బాగా పట్టి, రుచి మరింత పెరుగుతుంది.
ఫ్లేవర్ కోసం: పాయసం కాస్త చిక్కబడుతున్నప్పుడు అర టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్, శనగపప్పు అంత పచ్చకర్పూరం వేసి బాగా కలపాలి. పచ్చకర్పూరం గుడి ప్రసాదంలాంటి రుచిని ఇస్తుంది, కావాలంటే స్కిప్ చేయవచ్చు.
పాలు కలపడం: స్టవ్ ఆపి, కడాయిని పక్కన పెట్టుకోవాలి. ఒక నిమిషం పాటు పాయసాన్ని కలుపుతూ కాస్త చల్లారనివ్వాలి. వెంటనే పాలు కలిపితే విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఒక నిమిషం తర్వాత, మరిగించి పెట్టుకున్న పాలను నెమ్మదిగా కలుపుతూ పాయసంలో పోయాలి. సేమియా తీసుకున్న కొలతతో మూడు నుండి నాలుగు కప్పుల పాలు సరిపోతాయి. మొత్తం లీటరు పాలు కూడా వాడవచ్చు. వేడి మీద కాస్త పల్చగా అనిపించినా, చల్లారిన తర్వాత సరైన చిక్కదనానికి వస్తుంది.
ఈ పద్ధతిలో చేసిన సేమియా పాయసం ఎప్పటికీ పాలు విరగకుండా, చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా, కమ్మని రుచితో అద్భుతంగా ఉంటుంది. ఈసారి ప్రసాదం కోసం లేదా ఇంట్లో ప్రత్యేక వంటకం కోసం ఈ రెసిపీని ప్రయత్నించి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..