
ఈ రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ చూపే చాలామంది ఇష్టంగా తినే స్నాక్ ఫూల్ మఖానా. 100 గ్రాముల పాప్ చేసిన మఖానాలో 380 క్యాలరీలు, 84 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 11 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల ఫైబర్, అతి తక్కువ కొవ్వు (0.3 గ్రా) ఉంటాయి. అంతేకాకుండా కణ విభజన, హార్మోన్ల తయారీకి కావాల్సిన 16 రకాల ముఖ్యమైన అమైనో యాసిడ్లు ఇందులో లభిస్తాయి. అయితే మార్కెట్లో కొనుగోలు చేసిన మఖానాను ఉడికించకుండా లేదా వేయించకుండా పచ్చిగా తింటే కొన్ని నష్టాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పచ్చి మఖానాలో ఫైటిక్ యాసిడ్, టాన్నిన్లు అనే యాంటీ-నూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఫైటిక్ యాసిడ్ శరీరంలోని కాల్షియం, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలను బంధించి శరీరం గ్రహించకుండా చేస్తుంది. ఇందులోని సంక్లిష్ట పిండిపదార్థాలు జీర్ణం కావడం కష్టమై కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
మఖానాను దోరగా వేయించినప్పుడు లేదా వండినప్పుడు అందులోని ఫైటిక్ యాసిడ్ 30శాతం నుండి 50శాతం వరకు తగ్గిపోతుంది. దీనివల్ల యాంటీ-నూట్రియంట్స్ తగ్గడమే కాకుండా, శరీరానికి కాల్షియం, ఐరన్ సులభంగా అందుతాయి. అలాగే జీర్ణక్రియ తేలికవుతుంది.
పరిమిత మోతాదులో ఉన్న ఫైటిక్ యాసిడ్ మన శరీరానికి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ప్రయోగశాలలో డయాబెటిక్ ఎలుకలపై చేసిన పరిశోధనల్లో, దెబ్బతిన్న కణాల ఇన్సులిన్ రిసెప్టార్లను ఫైటిక్ యాసిడ్ ఎక్స్‌ట్రాక్ట్ పునరుద్ధరించినట్లు తేలింది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, కణాలు ఇన్సులిన్‌ను సరిగ్గా వినియోగించుకునేలా చేస్తుంది.
మోతాదు మించితే ఫైటిక్ యాసిడ్ వల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది. కానీ, మఖానాను నెయ్యి లేదా ఆలివ్ నూనెలో దోరగా వేయించి, రోజుకు 20 నుండి 30 గ్రాములు తీసుకోవడం వల్ల డయాబెటిస్ నివారణకు, బ్లడ్ షుగర్ అదుపునకు, హార్మోన్ల సమతుల్యతకు అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి.