Coconut Water: ఈ సమస్యలున్న వారు కొబ్బరి నీరు తాగితే విషమే..

అలసట నుంచి ఉపశమనం కలిగించే పానీయాలలో కొబ్బరి నీళ్ళు ఒకటి. కొబ్బరి నీళ్ళు కేవలం దాహం తీర్చడమే కాకుండా, శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. మలయాళంలో "దేవతల పానీయం" అని పిలువబడే కొబ్బరి నీళ్ళు, వాటి ఔషధ గుణాలకు అద్భుతమైన రుచికి ప్రసిద్ధి చెందాయి. ఇది మీ శరీరాన్ని చల్లబరచడానికి, ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన మార్గం.

Coconut Water: ఈ సమస్యలున్న వారు కొబ్బరి నీరు తాగితే విషమే..
Is Coconut Water Good For Everyone

Updated on: Jul 26, 2025 | 2:53 PM

కొబ్బరి నీరు చాలామంది ఆరోగ్య ప్రియులకు ఎంతో ఇష్టం. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలుండి శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, కొబ్బరి నీరు శరీరానికి శక్తిని అందించడమే కాకుండా, శరీరంలోని వ్యర్థాలను తొలగించడం (డిటాక్స్‌), చర్మ ఆరోగ్యం, జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది. అయితే, కొబ్బరి నీరు అందరికీ ఉపయోగకరం కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు దీనిని తాగడం వల్ల హానికర ప్రభావాలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు: కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు కొబ్బరి నీరు తాగకపోవడమే మంచిది. దీంట్లో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉండటంతో, కిడ్నీ రోగుల శరీరంలో పొటాషియం నిల్వ అయ్యే అవకాశం ఉంది. ఇది హైపర్‌కలేమియా అనే సమస్యకు దారితీస్తుంది. ఈ పరిస్థితి గుండెకు చాలా ప్రమాదకరంగా మారుతుంది.

డయాబెటిస్ ఉన్నవారు: డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరి నీరును జాగ్రత్తగా, పరిమితంగా మాత్రమే తాగాలి. ఇది సహజంగా తీపి గల పానీయం. అందులో గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటంతో రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచే ప్రమాదం ఉంది. కాబట్టి వైద్యుల సలహా తప్పనిసరి.

వృద్ధులు, హైబీపీ ఉన్నవారు, అలర్జీలు ఉన్నవారు: పొటాషియం అధికంగా ఉండటం వల్ల వృద్ధులలో గుండె పనితీరుపై ప్రభావం చూపవచ్చు. హైబీపీ (అధిక రక్తపోటు) రోగులు కొబ్బరి నీటిని అధికంగా తీసుకుంటే రక్తపోటు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే, కొందరికి కొబ్బరి నీరు తాగడం వల్ల చర్మం మీద అలర్జీ, మంట, ఎరుపు వంటి ప్రతికూల ప్రభావాలు కూడా కలుగుతాయి.

ఢిల్లీకి చెందిన న్యూట్రిషనిస్ట్ డా. రంజనా సింగ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. “కొబ్బరి నీరు ఆరోగ్యకరమైన పానీయం కానీ, అది అందరికీ కాదు. ముఖ్యంగా కిడ్నీ రోగులు, డయాబెటిక్ పేషెంట్లు, హైబీపీ ఉన్నవారు – వీరు తాగేముందు డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి” అని స్పష్టం చేశారు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా కొబ్బరి నీటిని పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలి. రోజుకు అర గ్లాసు లేదా ఒక గ్లాసు మించకుండా తాగడం మంచిది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టేవాళ్లు, ఎక్కువ ఎండలో పనిచేసేవాళ్లు కొద్దిగా ఎక్కువగా తాగవచ్చు. అయితే, ఏ పానీయం తాగినా ఒక మితి పాటించడం ముఖ్యం. ఈ కారణంగా, కొబ్బరి నీటిని ఆరోగ్య ప్రయోజనాల కోసం తీసుకునే ముందు, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి అది మీకు సరిపోతుందో లేదో తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడు మాత్రమే దీని ఉపయోగాన్ని సరైన రీతిలో పొందవచ్చు, అనవసరమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.