జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే ఒత్తుగా పెరగడం పక్కా..

జుట్టు ఎక్కువగా రాలిపోతోందా? మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు, కెమికల్ ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయారా? అయితే ఒక్క నిమిషం.. జుట్టు పైపైన మెరుగులు దిద్దడం కంటే అసలు సమస్య ఎక్కడుందో తెలుసుకోవడం ముఖ్యం. మన జుట్టు పెరగడానికి పునాది లాంటి స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. వంటింట్లోనే లభించే వస్తువులతో జుట్టు రాలడాన్ని శాశ్వతంగా ఎలా అరికట్టొచ్చో తెలుసుకుదాంం..

జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే ఒత్తుగా పెరగడం పక్కా..
How To Stop Hair Fall Naturally

Updated on: Jun 28, 2026 | 2:13 PM

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలడం. జుట్టు పలచబడటం, చివర్లు చిట్లడం, గ్రోత్ సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. దీనికి మన మారిన జీవనశైలి, మానసిక ఒత్తిడితో పాటు శరీరంలో సరైన పోషకాహార లోపం కూడా ప్రధాన కారణం. మన శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఐరన్ వంటి పోషకాలు అందనప్పుడు ఆ ప్రభావం నేరుగా జుట్టుపైనే కనిపిస్తుంది. అలాగే జుట్టును అతిగా కడగడం లేదా అసలు శుభ్రం చేసుకోకపోవడం వల్ల తల చర్మంలోని సహజ నూనెలు దెబ్బతిని జుట్టు బలహీనపడుతుంది. మరి ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే వస్తువులతో మీ జుట్టును ఎలా ఆరోగ్యంగా, ఒత్తుగా మార్చుకునే చిట్కాల గురించి తెలుసుకుందాం..

జుట్టు పెరగాలంటే తల చర్మం ఆరోగ్యం ముఖ్యం

మొక్క వేరు బలంగా ఉంటేనే చెట్టు బాగా పెరుగుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు తల చర్మం పునాది వంటిది. తలపై చుండ్రు పట్టడం, రసాయన ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడటం, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. దీనికి తోడు హెయిర్ స్ట్రెయిటనింగ్, డ్రైయర్స్ వంటి హీటింగ్ పరికరాలను తరచుగా వాడటం, బిగుతుగా ఉండే హెయిర్‌స్టైల్స్ వేసుకోవడం వల్ల జుట్టు త్వరగా ఊడిపోతుంది.

జుట్టుకు కావలసిన 3 ముఖ్యమైన పోషకాలు..

ప్రోటీన్: మన జుట్టులో దాదాపు 80 నుండి 85శాతం కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఆహారంలో కాయధాన్యాలు, టోఫు, డ్రై ఫ్రూట్స్, క్వినోవా వంటివి ఎక్కువగా తీసుకుంటే జుట్టు బలంగా పెరుగుతుంది.

ఇనుము – జింక్: ఇవి కుదుళ్లకు ఆక్సిజన్‌ను అందించి బలాన్నిస్తాయి. దీనికోసం పాలకూర, బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు క్రమం తప్పకుండా తినాలి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: ఇవి తల చర్మాన్ని పొడిబారకుండా ఉంచి, జుట్టు పెరిగేలా చేస్తాయి. ఇవి చియా గింజలు, వాల్‌నట్స్‌లో పుష్కలంగా లభిస్తాయి.

జుట్టు పెరుగుదలకు 4 అద్భుతమైన ఇంటి చిట్కాలు

కొబ్బరి నూనె – ఆముదం హెయిర్ మాస్క్

కొబ్బరి నూనె జుట్టుకు మంచి తేమను అందిస్తే.. ఆముదంలో ఉండే రిసినోలిక్ ఆమ్లం తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో 1 టేబుల్ స్పూన్ ఆముదం నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసి తలకు బాగా పట్టించి మసాజ్ చేయండి. గంట తర్వాత కెమికల్స్ లేని మైల్డ్ షాంపూతో కడిగేయండి.

కలబంద – రోజ్మేరీ హెయిర్ రిన్స్

కలబంద జుట్టుకు కండిషనర్‌లా పనిచేస్తుంది, రోజ్మేరీ ఆయిల్ కొత్త జుట్టు రావడానికి సహాయపడుతుంది. కొద్దిగా నీటిలో 2 టేబుల్ స్పూన్ల కలబంద జెల్, కొన్ని చుక్కల రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. జుట్టును షాంపూతో కడిగిన తర్వాత ఈ నీటితో తలను 4-5 సార్లు బాగా శుభ్రం చేసుకోండి.

నేచురల్ స్కాల్ప్ సీరమ్

జుట్టు కుదుళ్లను యాక్టివేట్ చేయడానికి ఈ సీరమ్ అద్భుతంగా పనిచేస్తుంది. 1 టేబుల్ స్పూన్ జోజోబా నూనె, 1 టేబుల్ స్పూన్ బాదం నూనె, 1 టేబుల్ స్పూన్ ఆర్గాన్ నూనె, 3 చుక్కల పుదీనా ఆయిల్ కలపండి. రాత్రి పడుకునే ముందు ఈ సీరమ్‌ను తలకు రాసి మెల్లగా మసాజ్ చేసుకోండి.

అవిసె గింజల జెల్

అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టు సాగే గుణాన్ని పెంచి, విరిగిపోకుండా చూస్తాయి. 2 కప్పుల నీటిలో 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలను వేసి, అది చిక్కటి జెల్ లాగా మారే వరకు బాగా మరిగించండి. చల్లారిన తర్వాత ఆ జెల్‌ను వడకట్టి జుట్టుకు అప్లై చేయండి. కొంతసేపటి తర్వాత సాధారణ నీటితో కడిగేయండి.

(గమనిక: ఈ సమాచారం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. అందరి శారీరక తత్వం ఒకేలా ఉండదు కాబట్టి ఏదైనా కొత్త హోమ్ రెమెడీ ట్రై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.)

Follow Us