Medu Vada recipe: శరీరానికి రోజంతా కావలసిన తక్షణ శక్తిని ఇచ్చే సూపర్ వడలు.. ఇలా చేసి తింటే..
రోజూ తినే పప్పు, అన్నం, కూరలతో బోర్ కొడితే, మధ్యాహ్న భోజనంలోకి ఈ టేస్టీ సౌత్ ఇండియన్ స్పెషల్ మెదు వడలను ట్రై చేయండి. ఇవి పైన క్రిస్పీగా, లోపల దూదిలా మెత్తగా ఉంటాయి. వీటిని వేడివేడి సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయి.

రోజూ అదే పప్పు, అన్నం, కూరలు తిని బోర్ కొట్టేసిందా? ఈరోజు లంచ్‌లోకి ఏమైనా వెరైటీగా, డిఫరెంట్‌గా తినాలనిపిస్తోందా? అయితే మీ కోసమే ఈ స్పెషల్ సౌత్ ఇండియన్ రెసిపీ! పైన కరకరలాడుతూ, లోపల దూదిలా మెత్తగా ఉండే వేడివేడి మెదు వడలు ఘుమఘుమలాడే సాంబార్ లేదా కారకారంగా ఉండే కొబ్బరి చట్నీతో వీటిని తింటే.. ఆహా, ఆ రుచే వేరు.. కాబట్టి లంచ్ టైమ్‌ని మరింత టేస్టీగా మార్చే ఆ పర్ఫెక్ట్ మెదు వడలు ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం
మెదు వడలకు కావలసిన పదార్థాలు:
- మినపప్పు (పొట్టు లేనిది) 1 కప్పు
- పచ్చిమిర్చి 2 సన్నగా తరిగినవి
- అల్లం తురుము 1 ఇంచు ముక్క
- కరివేపాకు 8-10 (సన్నగా తరిగినవి)
- కొత్తిమీర 2 చెంచాలు (సన్నగా తరిగినది)
- మిరియాల పొడి అర చెంచా
- ఇంగువ 1 చిటికెడు
- ఉప్పు రుచికి సరిపడా
- నూనె వేయించడానికి సరిపడా
మెదు వడల తయారీ విధానం:
ఇంట్లోనే మెదు వడలను చేసుకోవడం చాలా సులభం.. ఇందుకోసం మొదట మినపప్పును బాగా కడిగి, తగినంత నీరు పోసి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టండి. పప్పు బాగా నానిన తర్వాత అందులోని నీటిని పూర్తిగా వడకట్టేయండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో నీళ్లు పోయకుండా పప్పును గట్టిగా, కొద్దిగా బరకగా రుబ్బుకోండి. పిండి పల్చగా అవ్వకూడదు.
రుబ్బిన పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మీ చేతితో పిండిని ఒకే 4-5 నిమిషాల పాటు బాగా కలపండి.. ఇలా చేయడం వల్ల పిండి తేలికగా మారి, వడలు లోపల మెత్తగా వస్తాయి. ఆ తర్వాత ఈ పిండిలో తరిగిన పచ్చిమిర్చి, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర, మిరియాల పొడి, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోండి.
ఇప్పుడు చేతులకు కొద్దిగా నీరు రాసుకుని, కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని గుండ్రంగా చేసి, బ్రొటనవేలితో మధ్యలో చిన్న రంధ్రం పెట్టండి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి బాగా వేడి చేయండి. నూనె కాగాక మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, సిద్ధం చేసుకున్న వడలను జాగ్రత్తగా నూనెలో వేయండి.
వడలను అటుఇటు తిప్పుతూ రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. అంతే.. వేడివేడి, కరకరలాడే మెదు వడలు సిద్ధం. వీటిని కిచెన్ టిష్యూపైకి తీసుకుని, వేడి సాంబార్ మరియు కొబ్బరి చట్నీతో వడ్డించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
