
ఉదయం నిద్రలేవగానే చేతిలో వేడివేడి కాఫీ కప్పు పడితే వచ్చే ఉత్సాహమే వేరు. రోజంతా ఉల్లాసంగా, చురుగ్గా పనిచేయడానికి చాలామందికి కాఫీతోనే రోజు ప్రారంభం కావాలి. టీ ప్రియుల కంటే కాఫీ ప్రియులకు దాని సువాసన, రుచి విషయంలో ప్రత్యేకమైన ప్రాధాన్యతలు ఉంటాయి. అయితే చాలామంది ఇంట్లోనే కాఫీ చేసుకుంటున్నప్పటికీ, ప్రముఖ రెస్టారెంట్లు లేదా కేఫ్‌లలో లభించే తిరుగులేని సువాసన, రుచి ఇంట్లో రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కాఫీ తయారీలో తెలియకుండా చేసే కొన్ని సాధారణ తప్పిదాలే దీనికి ప్రధాన కారణం. సరైన పద్ధతులను పాటిస్తే అతి తక్కువ సమయంలోనే ఇంట్లోనే రెస్టారెంట్ స్థాయి కాఫీని ఆస్వాదించవచ్చు.
మరుగుతున్న నీటిలో కాఫీ పొడి వేయడం: చాలామంది నీళ్లు పొయ్యి మీద బాగా మరుగుతున్న సమయంలో నేరుగా కాఫీ పొడిని వేస్తుంటారు. తీవ్రమైన ఉష్ణోగ్రత వల్ల కాఫీలోని సహజమైన సుగంధ తైలాలు దెబ్బతిని, కాఫీకి అసహజమైన చేదు రుచి వస్తుంది.
ఎక్కువ సమయం మరిగించడం: కాఫీ చిక్కగా, గాఢంగా ఉండాలని ఎక్కువ సేపు పొయ్యి మీద ఉంచి మరిగిస్తారు. ఇలా చేయడం వల్ల కాఫీ రుచి పూర్తిగా మారిపోతుంది.
తప్పుడు క్రమంలో పాలు, పొడి కలపడం: నేరుగా మరుగుతున్న పాలలో కాఫీ పొడిని వేసి కలపడం వల్ల కాఫీ పొడి సరిగ్గా కరగక, దాని అసలైన ఫ్లేవర్ బయటకు రాదు.
ఉష్ణోగ్రతపై శ్రద్ధ లేకపోవడం: కాఫీ తయారీలో ఉష్ణోగ్రత చాలా కీలకమైన అంశం. మితిమీరిన వేడి కాఫీ నాణ్యతను తగ్గిస్తుంది.
నీటిని సరైన స్థాయిలో వేడి చేయడం: ముందుగా కొద్దిగా నీటిని తీసుకుని బాగా మరిగించి పొయ్యి పైనుంచి పక్కకు దించాలి.
డికాక్షన్ లేదా బేస్ సిద్ధం చేయడం: వేడి నీటిలో తగినంత కాఫీ పొడిని వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇది కాఫీ పొడిని సమానంగా కరిగించి చక్కటి సువాసనను ఇస్తుంది.
పాలు కలపడం: వేరొక గిన్నెలో బాగా మరిగించిన చిక్కటి పాలను ఈ కాఫీ మిశ్రమంలో కలపాలి.
అవసరమైతే ఒక్క పొంగు: పాలు కలిపిన తర్వాత ఎక్కువ సేపు మరిగించకుండా, అవసరమైతే కేవలం ఒక్క చిన్న పొంగు రాగానే వెంటనే స్టవ్ ఆపేయాలి.