
వంటల్లో చివర్లో కాస్త కొత్తిమీర చల్లితే ఆ రుచే వేరు. అయితే మార్కెట్ నుంచి ఎంత తాజాగా తెచ్చినా.. రెండ్రోజులకే వాడిపోవడం లేదా కుళ్లిపోవడం చాలామంది మహిళలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ధర ఎక్కువగా ఉన్నప్పుడు కొత్తిమీర పాడైపోతే మరీ బాధగా ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కొత్తిమీరను వారాల తరబడి, దాదాపు నెల రోజుల వరకు కూడా అప్పుడే కోసినంత తాజాగా నిల్వ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొత్తిమీర త్వరగా పాడవ్వడానికి ప్రధాన కారణం అందులో ఉండే తడి. మార్కెట్ నుంచి తెచ్చిన కొత్తిమీరను ముందుగా కడిగి, నీళ్లన్నీ పూర్తిగా ఆరిపోయే వరకు ఆరబెట్టాలి. ఆ తర్వాత కుళ్ళిన లేదా పాడైన ఆకులను తీసేయాలి. ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని, అడుగున పేపర్ టవల్ లేదా టిష్యూ పేపర్ పరచాలి. దానిపై కొత్తిమీరను ఉంచి, పైన కూడా మరొక టిష్యూ పేపర్ మూసి బాక్స్ మూత పెట్టాలి. టిష్యూ పేపర్ కొత్తిమీరలోని అదనపు తేమను పీల్చుకుని ఆకులు పాడవకుండా చూస్తుంది.
కొత్తిమీరను నెలల తరబడి నిల్వ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్.
తడి లేకుండా చూడండి: కొత్తిమీరను ఫ్రిజ్‌లో పెట్టేముందు అందులో తడి లేకుండా పూర్తిగా ఆరిపోయేలా చూడటం అత్యంత ముఖ్యం.
చెడిపోయిన ఆకులను తీసేయండి: ఒక్క ఆకు కుళ్లినా, దానివల్ల మిగిలిన కట్ట అంతా పాడైపోతుంది. కాబట్టి దాచే ముందే పాడైన ఆకులను వేరు చేయాలి.
ప్లాస్టిక్ సంచుల్లో నేరుగా పెట్టొద్దు: మార్కెట్ నుంచి తెచ్చిన ప్లాస్టిక్ కవర్‌లో అలాగే ఉంచితే తేమ పెరిగిపోతుంది.
ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే మీ వంటల్లో ఎప్పుడూ తాజా కొత్తిమీర సువాసన వెదజల్లుతూనే ఉంటుంది.